సందీప్ కిషన్ నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ స్టోరీ ఇదేనా…?

0

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి టాకీస్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాని నిర్మించాడు. అలానే తాను హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ అనే న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ స్టార్ కమెడియన్ హీరోగా పరిచయం చేస్తూ తన బ్యానర్ లో ”వివాహ భోజనంబు” అనే క్యాచీ టైటిల్ తో సినిమా ప్రకటించాడు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లు ప్రీ లుక్ పోస్టర్ లో మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్ లో హీరో ఫేస్ కనిపించకుండా సస్పెన్స్ మైంటైన్ చేసినప్పటికీ.. ఈ చిత్రంలో హీరోగా నటిస్తోంది హాస్యనటుడు సత్య అని తెలుస్తోంది.

‘వివాహ భోజనంబు’ స్టోరీ ఇదేంనంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఓ యువతీ యువకుడికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకుంటారు.. ఇదే క్రమంలో పెళ్లి వేడుక కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటారు.. మరో గంటలో యువతీ యువకుడు వివాహ బంధంతో ఒకటవుతారు అనుకున్న సమయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కొట్టుకుని విడిపోతారు.. అయితే అదే సమయంలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తుంది. దీంతో గొడవ పడిన ఇరు కుటుంబాలు ఒకే చోట కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.. మరి వీళ్ళు మళ్ళీ కలిసి ఆ వివాహం జరిపించారా లేదా అన్నదే ‘వివాహ భోజనంబు’ స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే మంచి పాయింట్ నే తీసుకున్నారని చెప్పవచ్చు. కాకపోతే లాక్ డౌన్ టైమ్ లోనే ఈ సినిమా తీసి రిలీజ్ చేస్తే బాగుండేదేమో. ఇటీవల తమిళ్ లో లాక్ డౌన్ నేపథ్యాన్ని తీసుకొని ఓ వెబ్ సిరీస్ పూర్తి చేసి రిలీజ్ చేసినట్లు అన్నమాట. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసి సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. మరి ఈ సినిమాని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.