Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇలా అయితే కష్టం అమ్మడూ!

ఇలా అయితే కష్టం అమ్మడూ!


చక్కని కనుముక్కుతీరుతో ఆడియన్స్ మనసులను దోచేసే కుర్ర హీరోయిన్స్ జాబితాలో ‘సురభి’ పేరు కూడా కనిపిస్తుంది. యువ హీరోలతో కలిసి జోరుగా షికారు చేసే పాత్రల విషయంలో ఆమెకి వంకబెట్టవలసిన పనిలేదు. ఇక ఇప్పటి కథానాయికలకి అలగడం ఒక్కటి వస్తే సగం నటన వచ్చేసినట్టే ఆ మాత్రం నటన సురభికి వచ్చు. చేయడానికి తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ రెండు భాషల్లో ఆశించినంత స్పీడ్ లేకపోవడమే అసలు సమస్య. సురభి తన కెరియర్ ను మొదలుపెట్టేసి ఏడేళ్లయినా చేసింది డజను సినిమాలు మాత్రమే!

తెలుగు తెరకి సురభి ‘బీరువా’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా చూసినవాళ్లు అమ్మాయి బాగుందన్నారు .. బాగా చేసిందని కూడా అన్నారు. ఆ తరువాత ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలోను ఆమె మెప్పించింది. ఇక ‘జెంటిల్ మెన్’ సినిమా మంచిపేరు తెచ్చినా ‘ఒక్క క్షణం’ .. ‘ఓటర్’ సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం సురభి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘శశి’ ఒకటి విడుదలకి రెడీ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా వ్యవహరించాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సురభి పాత్రమిటనేది తెలియదుగానీ తన కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందనే ఆమె భావిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. ఇక మరో తెలుగు సినిమా అప్ డేట్ మాత్రం లేదు. తెరపై చూస్తే సురభిలో ఎలాంటి మైనస్ లు కనిపించవు. బంగారు మేనిఛాయతో మెరిసే సురభికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె కళ్లు వేసే కోలాటాలకు ఆరాధకులూ ఉన్నారు.

వస్తే సినిమాలు చేద్దాం .. లేదంటే సినిమాలు చూద్దాం అన్నట్టుగా సురభి ఉండటం వల్లనే గ్రాఫ్ పెరగడం లేదనేది అభిమానుల మాట. చిన్నచిన్న అవకాశాలు .. చింతలేని పాత్రలు అనుకుంటే మాత్రం కష్టమేనంటున్నారు. ఇకనైనా సురభి మేల్కొంటే .. మంచి కథలకు .. పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తే ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాదిలో సురభి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.