సుశాంత్ దర్యాప్తు: రియా తొ సహా మరో ఐదుగురి బెయిల్ తిరస్కారం

0

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు లైవ్ అప్ డేట్స్ అంతకంతకు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి సహా మరో ఐదుగురి బెయిల్ అభ్యర్థన తిరస్కారానికి గురైంది. రియా- షోయిక్ చక్రవర్తి- అబ్దుల్ బాసిత్- జైద్ విలాత్రా- దీపేశ్ సావంత్- శామ్యూల్ మిరాండా అనే ఆరుగురు నిందితుల బెయిల్ దరఖాస్తులను ముంబై సెషన్స్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరించినట్లు తమకు సమాచారం అందిందని వారు హైకోర్టును ఆశ్రయిస్తారని న్యాయవాదులు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం సహా డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై అరెస్టయిన రియాను జైలుకు తరలించిన వెంటనే బెయిల్ దరఖాస్తుపై కోర్టు శుక్రవారం వరకు రిజర్వు చేసింది. సహ నిందితులు అలాగే ఆరోపణలు ఎదుర్కొన్న డ్రగ్ పెడ్లర్లు బసిత్ పరిహార్- జైద్ విలాత్రా బెయిల్ ను కూడా తిరస్కరించింది కోర్టు.

రియా ఆమె సోదరుడు బెయిల్ కోసం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వారి అభ్యర్ధనలను మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తిరస్కరించింది. తన న్యాయవాది సతీష్ మనేషిందే దాఖలు చేసిన తాజా పిటిషన్లో 28 ఏళ్ల రియా నిర్దోషి అని పేర్కొన్నారు. “ఆమె ఎటువంటి నేరానికి పాల్పడలేదు. ఈ కేసులో తప్పుగా చిక్కుకుంది“ అని పిటిషన్లో పేర్కొన్నారు. మనేషిందే- స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పాండే- ఎన్సిబి దర్యాప్తు అధికారి కిరణ్ బాబుల సమక్షంలో బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి విచారించడంతో తాజా నిర్ణయం కోర్టు ప్రకటించింది.

ఆరుగురు నిందితులందరూ త్వరలోనే బెయిల్ కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వీళ్లంతా మంగళవారం అరెస్టు కాగా సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన రియా – బైకుల్లా జైలులోనే ఉంటారు.