మిల్కీ బ్యూటీ అంత డిమాండ్ చేస్తోందా..?

0

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా మరో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా. సత్యదేవ్ హీరోగా నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ తెలుగులో రీమేక్. దీంతో పాటు నితిన్ హీరోగా నటుస్తున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా మిల్కీ బ్యూటీ నటించనుంది. ఈ ప్రాజెక్ట్స్ లో అమ్మడిది హీరోయిన్ రోల్ కాకపోయినా సినిమాలో చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు.

కాగా తమన్నా ఈ రెండు సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. సినిమాలైనా వెబ్ సిరీస్ లు అయినా.. పాత్ర నిడివి ఎంతున్నా.. హీరోయిన్ రోల్ అయినా.. నెగెటివ్ రోల్ అయినా.. హీరో ఎవరైనా.. సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా.. బిగ్ స్క్రీన్ మీద అయినా పారితోషకం మాత్రం 2 కోట్లు డిమాండ్ చేస్తోందట. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కోసం ఈ విధంగానే అగ్రిమెంట్ చేసుకుందని టాక్. కాకపోతే ‘అంధాదున్’ మేకర్స్ మాత్రం తమన్నాతో బేరాలాడే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో పారితోషికం విషయంలో తమన్నా ఓ మెట్టు దిగొచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు.