పూరీ ని నమ్ముకునే ఆ సినిమా తీసారా…?

0

నందు విజయ కృష్ణ – రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బ్లాస్టర్’. ఈ సినిమాలో నందు వైవిధ్యంగా ఉండే ‘పోతురాజు’ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ రోజు నందు పుట్టినరోజు సందర్భంగా ‘బొమ్మ బ్లాక్ బ్లాస్టర్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల – బోసుబాబు నిడుమోలు – ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్రంలో హీరో నందు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి వీరాభిమానిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పూరీకి ఫ్యాన్ అయిన పోతురాజు క్యారెక్టర్ తన అభిమాన దర్శకుడుకి స్టోరీ ఇవ్వాలనే కసిలో ఓ కథ రెడీ చేస్తుంటాడట. ఇదే ఈ సినిమాలోని కీలకమైన కథాంశమని తెలుస్తోంది. అంతేకాకుండా ‘బొమ్మ బ్లాక్ బ్లాస్టర్’ లోని చాలా సన్నివేశాలు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిజ జీవితం ఆధారంగా తీసుకుని రెడీ చేశారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

మరోవైపు రష్మీ గౌతమ్ అందాలు కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతాయని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోగా నిలదొక్కుకోడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్న నందు కి ఇప్పటి వరకు సరైన హిట్ లేదనే చెప్పాలి. ఈ మధ్య నందు ‘సవారీ’ అనే సినిమాతో వచ్చినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని రష్మీ అందాలను నమ్ముకుని తీసిన ‘బొమ్మ బ్లాక్ బ్లాస్టర్’ సినిమాతో అయినా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రం షూటింగ్ తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.