చిరు పెట్టుకున్న నమ్మకం వమ్ము కానివ్వలేదు!

0

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి.. శ్రీమంతుడు.. జనత గ్యారేజ్.. భరత్ అనే నేను చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కొరటాల శివ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. వీరు చేసిన అన్ని సినిమాల పాటలు సక్సెస్ అయ్యాయి. కనుక ఆచార్య కు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడనుకున్నారు. కొరటాల కూడా అదే అనుకుని ఉంటాడు. కాని చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కు మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని కొరటాలకు సిఫార్సు చేశారట. కొరటాల కూడా అందుకు అడ్డు చెప్పలేదు.

చిరంజీవి.. మణిశర్మల కాంబోలో అద్బుతమైన మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం మణిశర్మ కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం బాగాలేదు. ఆయన చిన్న సినిమాల సంగీత దర్శకుడిగా మారిపోయాడు. ఇలాంటి సమయంలో ఆయనకు ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మణిశర్మపై చిరంజీవి నమ్మకం పెట్టుకుని ఆచార్య సంగీత సారధ్య బాధ్యతను అప్పగించాడు. మరోసారి చిరంజీవికి మ్యూజికల్ సక్సెస్ ను మణిశర్మ ఇచ్చేలా ఉన్నాడు. నిన్న బర్త్ డే సందర్బంగా విడుదలైన ఆచార్య మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ధడ పుట్టించింది. అద్బుతంగా ఉండటంతో ఖచ్చితంగా పాటలు కూడా ఇదే రేంజ్ లో మణిశర్మ అందిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం మోషన్ పోస్టర్ లో సినిమాను సమ్మర్ 2021 అంటూ క్లారిటీ ఇచ్చారు. దాంతో షూటింగ్ ను ఈ ఏడాది చివరి నుండి ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. మణిశర్మ ‘ఆచార్య’ తో మ్యూజికల్ సక్సెస్ ను అందుకుంటే మళ్లీ కొన్నాళ్ల పాటు టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారే అవకాశం ఉందంటున్నారు. పాటల విషయంలో కూడా చిరు నమ్మకంను వమ్ము కానివ్వక పోవచ్చు అంటూ మణిశర్మపై మెగా ఫ్యాన్స్ నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.