క్రేజ్ తగ్గలేదనే విషయాన్ని రుజువు చేస్తున్న స్టార్ హీరోయిన్..!

0

దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోల సరసన లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇతర ఇండస్ట్రీలలో పెద్దగా ఆదరించకపోయినా టాలీవుడ్ జనాలు మాత్రం రకుల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇచ్చారు. అయితే ఆ మధ్య వరుసగా ప్లాప్స్ రావడంతో రేసులో వెనుకబడిపోయింది. దీంతో రకుల్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోందని కామెంట్స్ వచ్చాయి. అదే సమయంలో తెలుగులో సినిమాలు లేకపోయినా తమిళ హిందీ సినిమాలతో దూసుకుపోయింది. అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ హీరోలు మళ్ళీ అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అలానే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘చెక్’ సినిమాలో నితిన్ సరసన రకుల్ హీరోయిన్ నటిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించనున్న ‘థాంక్యూ’ సినిమాలో కూడా రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.

‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా రకుల్ సెకండ్ హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. గతంలో నాగ చైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా రకుల్ ఇలా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇంకా తన ఫామ్ తగ్గలేదనే విషయాన్ని రుజువు చేస్తోందని చెప్పవచ్చు.