2022 వరకూ పవర్ స్టార్ షెడ్యూల్ ఇదే

0

2020 పూర్తిగా వృథా అయ్యింది. విలువైన కాలాన్ని కరోనా నిర్ధాక్షిణ్యంగా కరిగించేసింది. చిన్న సినిమాల సంగతేమో కానీ.. ఈపాటికే రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాలేవీ రిలీజ్ కాకుండా పెద్ద దెబ్బే కొట్టింది. ఇందులో వకీల్ సాబ్ కూడా ఉంది. 2020 సమ్మర్ నాటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సడెన్ గా మహమ్మారీ విజృంభణతో చిత్రీకరణ ఆలస్యమైంది. వకీల్ సాబ్ డిలే ప్రభావం ఇతర సినిమాలపై ఎంత? అన్నది ఆరా తీస్తే అదేమీ చిన్నదేమీ కాదు.

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ మధ్యలోనే ఉంది. అతడు వైష్ణవ్ తేజ్ తో `కొండపొలం` చిత్రీకరణకు వెళ్లిపోవడానికి కారణం .. పవన్ ఇతర షెడ్యూల్లేనట. వకీల్ సాబ్ తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో వేషధారణ మార్పు ఏదీ లేకుండా నటించేయొచ్చట. కానీ క్రిష్ మూవీ కోసం అదే వేషధారణ కుదరదు. భారీగా జులపాలు పెంచి రాజుల కాలం నాటి వీరుడి గెటప్ కి మారాల్సి ఉంటుంది. అందువల్ల ఆ సినిమాని ప్యారలల్ గా చిత్రీకరించడం కుదరని పని అని తెలిసింది.

అందుకే క్రిష్ వేరొక సినిమా చేసుకుంటుంటే పవన్ మాత్రం వడి వడిగా వకీల్ సాబ్ పెండింగ్ షూట్ ముగించేస్తారట. దీంతో పాటు తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్రిష్ మూవీ మార్చి లేదా ఏప్రిల్‍ నుంచి మొదలు పెడితే 2021 దసరా రిలీజ్‍ కు ఆఫర్ ఉంటుందట. ఇకపోతే ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ సినిమా కూడా ఉంటుంది. అయితే అది 2022లోనే రిలీజ్ కానుంది. ఆ తర్వాత తిరిగి రాజకీయంగా పూర్తిగా బిజీ అయిపోతారు పవన్. తదుపరి ఎన్నికల్లో జనసేనాని పూర్తి స్థాయిలోనే వార్ లోకి దిగే వీలుందట. 2020 నవంబర్ మొదలు 2022 వరకూ పవన్ షెడ్యూల్ ఆ రకంగా ఉందన్నమాట.