బాలయ్య కోసం ఇద్దరు మలయాళి ముద్దుగుమ్మలే

0

బాలకృష్ణ.. బోయపాటి శీను కాంబోలో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల హీరోయిన్స్ విషయంలో ఎలాంటి ఎక్కువ జరగలేదు. కాని ఈసారి మాత్రం హీరోయిన్స్ విషయం ఓ పెద్ద టాపిక్ అయ్యింది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా హీరోయిన్ వారు వీరు అంటూ పది మంది పేర్లు ప్రస్థావనకు వచ్చాయి.

ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో బోయపాటి స్వయంగా ఒకానొక సమయంలో కొత్త హీరోయిన్ ను బాలయ్య కోసం తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ నెలలో మూడవ వారం నుండి షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షూటింగ్ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మళ్లీ హీరోయిన్ విషయంలో చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మలయాళి ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ను బాలయ్యకు జోడీగా ఎంపిక చేశారు అంటూ ప్రచారం జరిగింది.

ఈ కథ అనుసారం బాలయ్యకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు అవసరం. అందుకే మరో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి అంజలిని ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. గతంలో అంజలి బాలయ్యకు జోడీగా నటించింది కనుక మరోసారి ఆమెనే నటింపజేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని అంజలిని ఈ సినిమాలో నటింపజేయడం లేదు అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకు మరికొన్ని రోజులు టైం ఉండగా రెండవ హీరోయిన్ గా మరో మలయాళి ముద్దుగుమ్మ పూర్ణ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా కూడా ఢీ డాన్స్ షో జడ్జ్ గా పూర్ణ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపుతోనే సినిమాల్లో ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు బాలయ్య మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చిందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటీ అనేది బోయపాటి నుండి అధికారిక ప్రకటన వస్తే కాని క్లారిటీ రాదు.