‘వకీల్ సాబ్’ ఎప్పుడొస్తారో చెప్పరేం..!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్ కూడా సుమారు ఎనిమిది నెలల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టేసాడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఎండింగ్ కి పూర్తవుతుందని సమాచారం. అయితే షూటింగ్ కంప్లీట్ అవుతున్నా ‘వకీల్ సాబ్’ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. సంక్రాంతి కోసం ఇప్పటికే అర డజను మీడియం రేంజ్ సినిమాలు కర్చీఫ్ వేసాయి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ పై బయ్యర్స్ ఆసక్తి చూపిస్తారా లేదా అనేది చూడాలి.

అయితే ప్రస్తుతానికి థియేటర్స్ కి కాస్తో కూస్తో జనాల్ని రప్పించే సత్తా ఉన్న సినిమా ‘వకీల్ సాబ్’ మాత్రమేనని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ కంబ్యాక్ మూవీగా వస్తున్న ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి వస్తే మాత్రం థియేటర్స్ ఫుల్ అవుతాయని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా మేకర్స్ లాయర్ సాబ్ థియేటర్స్ కి ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా ఈ చిత్రానికి ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. థమన్ అందించిన ‘మగువా మగువా’ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. శృతి హాసన్ – అంజలి – నివేదా థామస్ – అనన్య – ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్టోరీ రెడీగా ఉన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేస్తాడని సమాచారం.