టాలీవుడ్ నుండి విజయ్ కి మాత్రమే చోటు

0

ఎవడే సుబ్రమణ్యం మరియు పెళ్లి చూపులు చిత్రాలతో టాలీవుడ్ దృష్టి ఆకర్షించించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డితో ఇండియా మొత్తం పాపులారిటీని దక్కించుకున్న విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాప్స్ పడ్డా ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ గత రెండు ఏళ్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏమీ ఇవ్వకున్నా కూడా 2019 సంవత్సరానికి గాను టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్ 10 లో నిలిచాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో నెం.1 స్థానంలో బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నిలిచాడు. మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నెం.2 గా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో మన టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఉన్నాడు. జాతీయ స్థాయిలో విజయ్ దేవరకొండ టాప్ 3లో ఉండటం అంటే ఆయనకున్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది ఉన్నా వారిలో రౌడీ స్టార్ తప్ప మరెవ్వరు కూడా టాప్ 10 లో కూడా నిలవలేక పోయారు. బాహుబలితో ఆల్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ కూడా ఈ జాబిత టాప్ 10 లో నిలవక పోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

ఉత్తరాదిన కూడా విజయ్ దేవరకొండకు మంచి ఫాలోయింగ్ ఉండటం వల్లే కరణ్ జోహార్ వంటి స్టార్ ఫిల్మ్ మేకర్ ఆయనతో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఫైటర్ చిత్రం నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నాడు. త్వరలో పూర్తి స్థాయి హిందీ సినిమాను రౌడీ స్టార్ తో చేయించేందుకు కరణ్ తో పాటు మరికొందరు నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఫైటర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతో పూరి మరోసారి తన స్టార్ డంకు తగ్గ సక్సెస్ ను దక్కించుకుంటాడేమో చూడాలి.