మెగా టీమ్ లో నంబర్-1 ఎవరు?

0

మెగా వటవృక్షం నీడన 11 మంది ఆటగాళ్లు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో దిగితే బంతుల్ని బౌండరీలకు తరలించడంలో మెగా బ్యాట్స్ మన్స్ తర్వాతే. సిక్సర్లు బాదినా.. ఛార్ కా ధమ్కీ కొట్టినా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసినా మెగా చేతివాటమే వేరు. ఆ లెవలే వేరుగా ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగొచ్చాకా బ్యాటింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు. 60 ప్లస్ లోనూ ఆయన అన్ స్టాపబుల్ బౌండరీలతో చెలరేగుతున్నారు. ఖైదీనంబర్ 150తో ఇండస్ట్రీ రికార్డుల్నే తిరగరాసిన తీరు అసాధారణం. ఆ తర్వాత సైరా -నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమాలో స్వాతంత్య్ర సమర యోధుడిగా నటించి మెప్పించారు. సైరా.. ఇరుగు పొరుగు భాషల్లో ఆశించినంత ఆడకపోయినా…టాలీవుడ్ బాక్సాఫీస్ ని బంతాడేసిన తీరుప్రముఖంగా చర్చకు వచ్చింది.

ఇక అన్నయ్య తర్వాత తమ్ముడే అన్నంత పేరు తెచ్చుకున్నారు పవన్ కల్యాణ్. ఎప్పుడు వచ్చినా ఆయన తిక్కకో లెక్కుంది! ఆ బ్యాటింగుకో స్టైలుంది!! అంటూ అభిమానులంతా కిక్కులో ఉంటారు. కొంత గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ గా తిరిగొస్తుంటే ఆయన మరోసారి ఇండస్ట్రీ రికార్డును లాక్కుంటారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. చిరు ఫుల్ గా చెలరేగితే టాప్ పొజిషన్ కి వెళ్లిపోతారు..పవన్ కంబ్యాక్ తో తిరిగి దూసుకొచ్చే ఛాన్సుంది.. అన్న చర్చా నిరంతరం మెగాభిమానుల్లో సాగుతూనే ఉంటుంది.

ఇకపోతే మొన్నటి వరకూ రంగస్థలం రికార్డుల్ని బ్రేక్ చేసిన సినిమా రాలేదు. 2020 సంక్రాంతికి ఆ రికర్డును అల్లు అర్జున్- అల వైకుంఠపురములో బ్రేక్ చేసింది. దీంతో అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. రికార్డుల పరంగా టాప్ వన్ పొజిషన్ లో నిలిచారు అల్లు వారసుడు. రంగస్థలం రికార్డులు బ్రేక్ చేయడంతో చెర్రీ రేసులో రెండో స్థానానికి పరిమితమయ్యారు.

అయితే ఈసారి చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ టాలీవుడ్ లో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు. మరోసారి చరణ్ టాప్ స్లాట్ లోకి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే యంగ్ ట్యాలెంట్ అల్లు అర్జున్.. రామ్ చరణ్ కూడా ఓపెనర్ బ్యాట్స్ మన్స్ లాగా మంచి ఫేసింగ్ లో ఉన్నారు. నెక్ట్స్ వచ్చే బ్యాట్స్ మన్ లా ఈ ఏజ్ లోనూ పోటీపడుతున్న చిరంజీవి.. పవన్ కల్యాణ్ ప్రతిసారీ స్ట్రైకింగ్ బ్యాట్స్ మన్స్ అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది.

మెగా బ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మెగా హీరోల్లో ఎవరూ టచ్ చేయలేని కాన్సెప్టులు ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు. బ్లాక్ బస్టర్లు కొడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు వరుణ్. అలాగే సుప్రీంహీరో సాయి తేజ్ పడి లేచిన కెరటంలా మళ్లీ ట్రాక్ లోకొచ్చాడు.. వైష్ణవ్ తేజ్.. శిరీష్.. కళ్యాణ్ దేవ్.. ఇలా ఇతరుల ప్రయత్నాలు తక్కువగా ఏం లేవ్.. అలాగే మెగా కాంపౌండ్ ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత కూడా నటించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. నటిగా నిర్మాతగా నిహారిక మార్క్ వేస్తుందా? అన్నది వేచి చూడాలి. పవన్ వారసుడు నూనూగు మీసాల అకీరా నందన్ రేసులోకి దూసుకొస్తే సన్నివేశం ఎలా మారుతుందా? అన్నది కూడా టాలీవుడ్ లో అంతకంతకు ఆసక్తిని పెంచుతోంది.