Viral: కాటికి కాలు చాచాల్సిన వయసు వారిది. రేపో మాపో అన్నట్టే ఉన్నారు. ఆ వయసులో వారు బతకడమే కష్టం. కానీ ఆ వృద్ధ దంపతులు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. ఏకంగా బిడ్డను కనేశారు. అంత ముదిమి వయసులో వారికి వచ్చిన వారసుడిని చూసి సంబరపడ్డారు. పెళ్లైన 54 ఏళ్లకు సంతాన భాగ్యం కలిగినందుకు ఆనందభాష్పాలు రాల్చారు.
రాజస్థాన్ కు చెందిన గోపీచంద్ కు 75 ఏళ్ల వయసు. ఆయన భార్య చంద్రావతికి 70 ఏళ్లు. ఈ దంపతులకు ఏకంగా 1968లో వివాహమైంది. పెళ్లై 54 ఏళ్లు అవుతున్నా వారికి సంతానం కలగలేదు. అయితే ఆళ్వార్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యలు వారి చిరకాల వాంఛను నెరవేర్చింది. లేటు వయసులో వారికి ఘాటు కొడుకును ఇచ్చింది.
ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ ముసలి దంపతులు తల్లిదండ్రులయ్యారు. 70 ఏళ్ల వృద్ధురాలు ఆ వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
దేశంలో 70 ఏళ్ల ముదిమి వయసులో చాలా తక్కువ మంది మాత్రమే ఆ వయసులో తల్లిదండ్రులయ్యారని.. రాజస్థాన్ లో అయితే ఇదే మొదటి కేసు అని డాక్టర్ తెలిపారు.
రాజస్థాన్ లోని జుంజునులోని నుహానియా గ్రామానికి చెందిన గోపీచంద్ భారత ఆర్మీలో పనిచేశాడు. బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొని గాయపడ్డాడు. 54 ఏళ్ల వివాహం చేసుకున్న గోపీచంద్ కు పిల్లలు లేరు. పిల్లల కోసం గోపీచంద్, అతడి భార్య చంద్రావతి ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం రాలేదు. చివరకు ఐవీఎఫ్ వైద్యుడు పంకజ్ గుప్తాను ఆశ్రయించి చికిత్స తీసుకున్నారు. వారి కల ఫలించి 70 ఏళ్ల వయసులో గోపీచంద్ భార్య సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ వయసులో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మా వంశం నిర్వంశం అవుతుందని ఆందోళన చెందామని.. కానీ ఈ వయసులో తమకు సంతాన ప్రాప్తి కల్పించిన వైద్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణం కోసం తాము ఎన్నో ఏళ్లు ఎదురుచూశామని గోపీచంద్ అన్నాడు.