కరణ్ పై అమీర్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు

0

బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ అంటూ పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు బయటకు వెళ్లాలి అంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన కరణ్ కు ఇప్పుడు ఏ ఒక్కరు బాసటగా నిలవడం లేదు అనడంలో సందేహం లేదు. తాజాగా అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్ కూడా కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్ లో గ్రూపిజం అనేది చాలా కామన్. ప్రపంచం మొత్తం అవినీతి మయం అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవినీతి విచ్చలవిడిగా ఉంది అంటూ ఫైజల్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వలాభం మరియు బంధుప్రీతితో పని చేస్తూ ఉన్నారు. ఎవరైనా పరాజయాల్లో ఉంటే వారిని చిన్న చూపు చూడటంతో పాటు అవమానించడం కూడా జరుగుతుంది.

నా సోదరుడు అమీర్ ఖాన్ 50వ పుట్టిన రోజు సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న కరణ్ జోహార్ నాతో తప్పుగా ప్రవర్తించాడు. నేను మరొకరితో మాట్లాడుతున్న సమయంలో మా సంభాషణ కట్ చేయడంతో పాటు నాతో చాలా చులకనగా ప్రవర్తించాడు అంటూ ఫైజల్ ఖాన్ పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం చాలా కష్టం అని ఎంతో మంది కష్టపడుతున్నారు అంటూ ఫైజల్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.