ఖుషీ కపూర్ ఎంట్రీ అంటూ టీజ్ చేసిన బోనీ కపూర్

0

అతిలోక సుందరి శ్రీదేవి – బోనీ కపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీకపూర్ ఎంట్రీ తర్వాత ఎప్పటికప్పుడు బోనీపై మీడియా ఇదే ప్రశ్న సంధిస్తున్నా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.

ఎట్టకేలకు దీనిపై బోనీ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇంకా ఆయన ఖుషీ కపూర్ నటించే తొలి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించలేదు. జాన్వి కపూర్ పరిశ్రమలోకి అడుగుపెట్టేప్పుడు ఇంతటి సస్పెన్స్ ని మెయింటెయిన్ చేయలేదు కానీ ఖుషీ ఎంట్రీ విషయంలో ఆయన ఎంతో వెయిటింగ్ చేయిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఖుషీ నట వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నట్లు బోనీ వెల్లడించారు. “మీరు త్వరలో ఒక ప్రకటన వింటారు“ అంటూ టీజ్ చేశారు.

పెద్ద తెరపై జాన్వీ సోదరి ఖుషీ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలన్న తహతహ అభిమానులకు ఉంది. అయితే బోనీ మాత్రం తాను ఖుషీని లాంచ్ చేయబోనని స్పష్టం చేశారు. ఖుషీ గ్రాండ్ లాంచ్ మరో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ చేస్తుందని అన్నారు. “నాకు వనరులు ఉన్నాయి. కాని నేను వేరొకరు ఆమెను ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆమె తండ్రిని. నిర్మాతగా నేను పరిచయం చేయడం నచ్చదు. అలాగే తనకు కూడా మంచిది కాదు“ అని అన్నారు.

ఖుషీ విషయానికొస్తే.. ఇప్పటికే నట శిక్షణ తీసుకుంది. అలాగే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఖుషీ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను పబ్లిక్ గా మార్చింది. అప్పటినుండి ఖుషీ గ్లామర్ షో రెట్టించింది. తనకు అక్కలానే.. ఫ్యాషన్ పై మక్కువ ఎక్కువ అని అర్థమవుతోంది.