19వ సారి చిరు బాలయ్యలు ఢీ కి రెఢీ

0

టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. దాదాపు రెండు దశాబ్దాల పాటు వీరి జోరు టాలీవుడ్ లో కొనసాగింది. ఒక్కో ఏడాది అరడజనుకు పైగా సినిమాలు విడుదల చేసి వీరు సత్తా చాటారు. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో ఆధిపత్యం కోసం 1980 ల నుండే పోటీ పడుతూ వచ్చారు. కెరీర్ ఆరంభంలో నువ్వా నేనా అన్నట్లుగా వీరి స్టార్ డం కొనసాగింది. కాల క్రమేనా మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధించారు. నెం. 1 గా చిరంజీవి నిలిచారు. ఆ తర్వాత కూడా చిరంజీవికి పోటీగా బాలయ్య గట్టిగానే నిలిచారు. 1984 నుండి చిరంజీవి.. బాలకృష్ణల మద్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 18 సార్లు బాక్సీఫీస్ వద్ద వీరిద్దరు ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడ్డారు.

1984లో మొదటి సారి చిరంజీవి అగ్నిగుండం.. బాలకృష్ణ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి సారి ఆరు రోజుల గ్యాప్ లో వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. మొదటి పోటీలో బాలకృష్ణ పై చేయి సాధించారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సూపర్ హిట్ గా నిలిచింది. అదే ఏడాది చిరంజీవి ఇంటి గుట్టు.. బాలకృష్ణ మంగమ్మగారి మనవడు ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెంటిలో మంగమ్మగారి మనవడు సూపర్ హిట్ గా నిలిచింది. 1984లోనే చిరంజీవి రుస్తుం మరియు బాలకృష్ణ కథానాయకుడు కూడా వారం గ్యాప్ లో వచ్చాయి. మరో సారి బాలయ్య పోరులో విన్ అయ్యాడు. 1985లో సంక్రాంతికి విడుదల అయిన చిరంజీవి చట్టంతో పోరాటం మరియు బాలకృష్ణ ఆత్మబలం సినిమాల్లో చిరు మూవీ హిట్ గా నిలిచి మొదటి సారి చిరంజీవి బాలయ్యపై పై చేయి సాధించాడు. ఆ తర్వాత ఇద్దరు హీరోలు కూడా 2017 లో ఖైదీ నెం.150 మరియు గౌతమి పుత్ర శాతకర్ణిలతో కలిపి మొత్తం 18 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అందులో ఎక్కువ సార్లు చిరంజీవి పై చేయి సాధించారు. మళ్లీ వీరిద్దరు 2021లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.

చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30వ తారీకున ఆచార్య సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాను కూడా కాస్త అటు ఇటుగా అతే సమయంలో విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట. దాంతో 19వ సారి చిరు బాలయ్యల మద్య బాక్సాఫీస్ వార్ జరుగబోతుంది. ట్రాక్ రికార్డ్ మరియు దర్శకుల రికార్డ్ ను చూస్తే రెండు సినిమాలు కూడా హిట్ గానే నిలిచినా చిరంజీవి సినిమా పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా ఈ ఇద్దరి మద్య పోటీ అంటే ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అనడంలో సందేహం లేదు.