Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాపీ ఆరోపణలపై మెగా హీరోలు స్పందిస్తారా…?

కాపీ ఆరోపణలపై మెగా హీరోలు స్పందిస్తారా…?


సినీ పరిశ్రమలో కాపీ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. స్టోరీ.. సీన్స్ లేదా టైటిల్ విషయంలో తరచుగా ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి. అయితే మెగా హీరోలు నటించే సినిమాలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ”ఆచార్య” సినిమాపై కూడా అలాంటి కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా స్టోరీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ నేపథ్యం తన కథ నుంచి కాపీ చేసారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపించారు. ‘పుణ్యభూమి’ అనే టైటిల్ తో 2006లో తాను ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించానని.. మోషన్ పోస్టర్ లో ఉన్న ‘ధర్మస్థలి’ అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని అనిల్ కృష్ణ పేర్కొన్నారు.

అంతేకాకుండా ‘ఆచార్య’ కథ నాదే అంటూ బీ. గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే రచయిత ప్రెస్ నోట్ ను విడుదల చేశాడు. తాను రాసుకున్న కథని రెండేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ వారికి వినిపించానని చెప్పుకొచ్చాడు. ఈ స్టోరీ లైన్ ప్రొడ్యూసర్ రవి కుమార్ కి చెప్పానని.. కంప్లీట్ స్టోరీని మైత్రీ మూవీ మేకర్స్ కో ప్రొడ్యూసర్ చెర్రీకి వినిపించానని పేర్కొన్నాడు. ఇప్పుడు అదే స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ తో క్లోజ్ గా ఉండే కొరటాల శివ సినిమా చేస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై పరుచూరి గోపాలకృష్ణని కూడా కలిశానని.. తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ చేసానని.. కానీ వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ లీగల్ గా వెళ్లాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ – చిరంజీవి ఈ విషయంలో కలుగజేసుకొని సాయం చేయాలని రాజేష్ మండూరి కోరాడు.

మరోవైపు అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాపై కాపీ ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. ప్రముఖ రచయిత సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డా. వేంపల్లి గంగాధర్ ‘పుష్ప’ సినిమా తన పుస్తకం మరియు వ్యాసాల ఆధారంగా రూపొందిస్తున్నారని ఆరోపించాడు. తాను రాసిన ‘తమిళ కూలీ’ కథ మరియు ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ కాపీ ఆరోపణలపై మెగా హీరోలు స్పదిస్తారేమోచూడాలి. గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ సమయంలో కూడా స్టోరీ తనదేనని.. తమిళ్ ‘కత్తి’ సినిమా తన స్టోరీని దొంగిలించి తీసారని.. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న చిరంజీవి న్యాయం చేయాలని ఓ రచయిత పిర్యాదు చేశాడు. చిరంజీవి కలుగజేసుకొని అతనికి న్యాయం చేసాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ రాజేష్ ఆరోపిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆచార్య’ మూవీని నిర్మించడం లేదు.. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’ ని నిర్మిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ‘ఆచార్య’ ‘పుష్ప’ కాపీ వివాదాలు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి.