జోనర్ వైవిధ్యం అతడికి మాత్రమే సాధ్యం

0

ఒక సినిమాకి ఇంకో సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా జోనర్ మార్చి తెరకెక్కించాలంటే చాలా గట్స్ కావాలి. టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ డైరెక్టర్లు ఒక సేఫ్ జోన్ కి లోబడి సినిమాలు తీయడం చూస్తున్నదే. వీళ్ల కథలు ఇంచుమించు ఒకే తరహాలో ఉంటాయి. నటీనటులు.. పాత్రల తీరుతెన్నులు మారుతుంటారు. కాన్వాసు మారుతుంటుంది అంతే.

ఉదాహరణకు త్రివిక్రమ్ ఎప్పటికీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకు మాత్రమే అంకితం. తనదైన ఛమత్కారవంతమైన మాటల పదును ఉపయోగించి సింపుల్ గా ఫన్ ఎమోషన్ తో కుటుంబ కథా చిత్రాల్ని అందిస్తున్నారు. బోయపాటి శ్రీను పూర్తిగా మాస్ మసాలా కథాంశాల్ని మాత్రమే ఎంచుకుంటారు. ప్రతి ఫ్రేమ్ ని రంగుల మయం చేసేందుకు భారీ యాక్షన్ కోసం పాకులాడుతుంటారు.

పూరి జగన్నాథ్ అయితే ఘాడమైన రొమాన్స్ .. మాస్ ఎంటర్ టైనర్లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. కొరటాల శివ సామాజిక సందేశం ఉన్న కథల్ని ఎంచుకుని పక్కా ఎంటర్ టైనర్లుగా మలచగలరు. ఇక రాజమౌళి వీళ్లందరి కంటే విభిన్నంగా ప్రతిదీ భారీ కాన్వాస్ ఉన్న విలక్షణ చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లను వదిలేసి గత కొంతకాలంగా ఆయన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.

సుకుమార్ .. క్రిష్ మాత్రం వీళ్ల శైలికి భిన్నంగా వెళుతుంటారు. సుక్కూ కెరీర్ తొలి నుంచి ఈ తరహాలో ప్రయోగాలు చేసారు. క్యారెక్టరైజేషన్ బేస్డ్ గా చేసుకుని కథల్ని అల్లడంలో సుక్కూ స్పెషలిస్ట్. కానీ జోనర్ పరంగా పూర్తి అవేగా వెళ్లరు. ఇకపోతే ఉన్న అందరిలోనూ క్రిష్ విలక్షణ దర్శకుడు అంటే అతిశయోక్తి కాదు. కెరీర్ తొలి నుంచి ఆయనది ఇదే పంథా. అసలు ఒక సినిమా జోనర్ కి ఇంకో సినిమా జోనర్ తో సంబంధం లేకుండా కథల్ని ఎంచుకుంటాడు. గమ్యం.. కృష్ణం వందే జగద్గురుమ్.. కంచె.. గౌతమిపుత్ర శాతకర్ణి.. ఎన్టీఆర్ బయోపిక్ ఇవన్నీ డిఫరెంట్ జోనర్స్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో తీస్తున్న సినిమా జానపదం బేస్ చేసుకుని. తదుపరి రకుల్ – వైష్ణవ్ తేజ్ జంటగా ది జంగిల్ బుక్ తరహా కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ తరహా వైవిధ్యం అతడికి మాత్రమే సాధ్యం.