యూఎస్ వెళ్లిన ‘సర్కారు వారి పాట’ టీం

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలో పలు ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉందట. కరోనా కారణంగా అమెరికాలో చిత్రీకరణ కష్టం అనుకున్నారు. కాని దర్శకుడు పరశురామ్ అనుకున్న కథకు అక్కడ చిత్రీకరణ చేస్తేనే బాగుంటుందని కాస్త ఆలస్యం అయినా అక్కడే చిత్రీకరణ చేయాల్సిందే అన్నట్లుగా యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్స్ సాదారణంగా జరుగుతూనే ఉన్నాయి. కనుక సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను కూడా అక్కడ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సినిమా లొకేషన్స్ పరిశీలించడం కోసం దర్శకుడు పరశురామ్ మరియు సినిమాటోగ్రాఫర్ ఆర్ట్ డైరెక్టర్ లు తాజాగా అమెరికా వెళ్లారు. అక్కడ గోపీకృష్ణ నర్రావులతో కలిసి లొకేషన్స్ ను పరిశీలించడంతో పాటు అనుమతులు కూడా తీసుకోబోతున్నారట. నవంబర్ లేదా డిసెంబర్ నుండి అమెరికాలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను అమెరికాలోనే ప్రారంభించి అక్కడ పూర్తి అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపనున్నారట.

బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతిపై ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబును ఈ సినిమాలో పరశురామ్ సరికొత్తగా చూపించబోతున్నాడట. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. వచ్చే ఏడాది దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.