మీర్జాపూర్ 2 ట్రైలర్ టాక్

0

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ వెబ్ వరల్డ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. క్రైమ్ – థ్రిల్లర్ – యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. పంకజ్ త్రిపాఠి – అలీ ఫజల్ – శ్వేత త్రిపాఠి – దివ్యేందు శర్మ – హర్షితా శేఖర్ – రసిక దుగల్ – కుల్భూషణ్ ఖర్బండా లు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో కూడా ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఈ సిరీస్ కు కొనసాగింపుగా ‘మీర్జాపూర్ 2’ ను రూపొందించారు. దాదాపు రెండేళ్ల నుంచి సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. తాజాగా ‘మీర్జాపూర్ 2’ ట్రైలర్ విడుదల చేశారు.

‘మీర్జాపూర్’ ఫస్ట్ సీజన్ లో గుడ్డు(అలీ ఫజల్) సోదరుడు బబ్లూ పండిట్(విక్రాంత్) మరియు భార్య శ్వేత(శ్రియ పిల్గోంకర్)లను మున్నా(దివ్యేందు శర్మ) చంపేసే వరకు చూపించారు. ‘మీర్జాపూర్ 2’ ట్రైలర్ చూస్తుంటే గుడ్డు మరియు గోలు (శ్వేత సోదరి) ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కోణంలో సీజన్ 2 ఉండబోతోందని అర్థం అవుతోంది. అంతేకాకుండా మీర్జాపూర్ లో మున్నా భాయ్ ఆధిపత్యం కొనసాగినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఓటీటీ ఆడియన్స్ ని ఆకర్షించే డైలాగ్స్.. కట్టిపడేసే సన్నివేశాలు ఈ సీజన్ లో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో మొదటి సీజన్ లోని నటీనటులతో పాటు విజయ్ వర్మ – ఇషా తల్వార్ – అమిత్ సియాల్ – అంజుమ్ శర్మ మరియు మరి కొందరు నటులు కొత్తగా కనిపించనున్నారు. మొత్తం మీద 2 నిమిషాల 48 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఫస్ట్ సీజన్ కంటే భారీ స్థాయిలో తీసినట్లు తెలుస్తోంది.

కాగా పునీత్ కృష్ణ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ కు గుర్మీత్ సింగ్ మరియు మిహిర్ దేశాయ్ లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రితేశ్ సిద్వానీ – ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘మీర్జాపూర్ 2’ ట్రైలర్ విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని.. సీజన్ 2 అభిమానులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నిర్మాతల్లో ఒకరైన రితేశ్ సిద్వానీ తెలిపారు. ‘మీర్జాపూర్ 2’ అక్టోబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. అయితే తెలుగులో కూడా ఈ సీజన్ అందుబాటులో ఉంచుతారా లేదా అనేది చూడాలి.