మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

0

అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అంటే ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఒక్కోసారి అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి దుర్ఘటన చేసుకుంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగి విద్యుత్ ఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ అభిమానులు సోమశేఖర్ – అరుణాచలనం – రాజేంద్ర అక్కడికక్కడే చనిపోయారు. హరికృష్ణ – పవన్ – సుబ్రహ్మణ్యం – అరుణ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

కాగా ఈ దుర్ఘటనపై రామ్ చరణ్ స్పందించారు. ”నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రామ్ చరణ్ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ తన అభిమానుల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. తన పట్ల గుండెల నిండా అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జన సైనికులు సోమశేఖర్ – రాజేంద్ర – అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ అన్నారు. విద్యుత్ ఘాతంతో మృతి చెందిన అభిమానులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్లు పవన్ ప్రకటనలో తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి సరైన వైద్యం అందేలా చూడాలని స్థానిక నాయకులను కోరినట్లు పవన్ తెలిపారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు చనిపోయిన ఫ్యాన్స్ కుటుంబాలకు ‘వకీల్ సాబ్’ టీం అండగా నిలిచింది. అభిమానుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు ప్రకటిస్తూ మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ ఓ ప్రకటన వెలువరించింది.