వకీల్ సాబ్ ని వెతుక్కుంటూ వచ్చిన భాగ్యలక్ష్మి

0

నిన్ననే శ్రుతిహాసన్ హైదరాబాద్ లోని విశాలమైన రోడ్ లో జాగింగ్ చేస్తూ ప్రత్యక్షమైంది. ఉన్నట్టుండి శ్రుతి ఇక్కడ దిగిపోయిందేమిటి? చెన్నయ్ ముంబై కంటే హైదరాబాదే ఎక్కువైందా? అంటూ ఆరాలు తీసారు.

ఇంతకీ శ్రుతి హైదరాబాద్ కి ఎందుకు వచ్చినట్టు? అంటే.. వకీల్ సాబ్ సెట్స్ లో జాయినయ్యేందుకే ఇక్కడ ఉంది అన్న ప్రచారం సాగిపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వకీల్ సాబ్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో పవన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

తాజా షెడ్యూల్ లో పవన్ తో పాటు హీరోయిన్ శ్రుతి హసన్ కూడా సెట్స్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తరువాత దీనిపై ఎటువంటి సమాచారం లేదు. నిజానికి శ్రుతి షెడ్యూల్ ఇప్పట్లో లేదట. డిసెంబర్ నుండి శ్రుతి హాసన్ వకీల్ సాబ్ టీమ్ లో చేరనుందట.

పవన్ కల్యాణ్ – శ్రుతిహాసన్ కాంబినేషన్ అనగానే గబ్బర్ సింగ్ గుర్తుకు వస్తుంది. ఆ మూవీలో తిక్క లెక్క తెలిసిన పోలీసాఫీసర్ గా పవన్ కల్యాణ్ నటిస్తే.. చూపులతోనే ప్రేమలో పడేసే భాగ్యలక్ష్మిగా శ్రుతిహాసన్ నటించింది.

పవన్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అంజలి- నివేదా థామస్- అనన్య నాగల్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పిక్ కి రీమేక్ ఇది. కోలీవుడ్ లోనూ అజిత్ హీరోగా రీమేకై ఘనవిజయం సాధించింది. టాలీవుడ్ రీమేక్ ఎలాంటి విజయం సాధించనుంది? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.