రాజకీయాల్లోకి వస్తా…కానీ..: సోనూసూద్

0

లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కూలీలు కార్మికులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒక్కసారిగా రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది ఆకలి తీర్చి….వారందరినీ స్వస్థలాలకు చేర్చిన సోనూసూద్ వారిపాలిట దేవుడిగా మారాడు. ఇక లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతూ సాయం కోరిన పేద మధ్యతరగతి ప్రజలకు తోచిన సాయం చేస్తున్నాడు సోనూసూద్. ఆన్ లైన క్లాసుల కోసం ఫోన్లు కొందరు యువతకు ఉపాధి…ఇలా అనేక కార్యక్రమాలతో సోనూసూద్ పేరు మార్మోగిపోతోంది. దీంతో సోనూసూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై సోనూసూద్ క్లారిటీ ఇచ్చాడు. తాను నటుడిగా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశాడు సోనూ సూద్. ఒకేసారి రెండు పడవలపై కాలు పెట్టనని తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నాడు. గత పదేళ్లుగా చాలామంది తనను రాజకీయాల్లోకి రావాలని అడుగుతున్నారని కానీ తాను ప్రస్తుతానికి నటుడిగా కొనసాగుతానని అన్నాడు.

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే…నూటికి నూరు శాతం ప్రజాసేవ చేస్తానని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నాడు. అయితే ఇపుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేనని తాను ప్రస్తుతం అనుకున్న పనులు స్వేచ్చగా చేయగలుగుతున్నానని చెప్పాడు. ఇపుడైతే తాను చేస్తున్న పనులపై తనదే తుది నిర్ణయమని కాబట్టే స్వేచ్చగా సాయం చేయగలుగుతున్నానని అన్నాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వలస కూలీలు నడిచి వెళుతున్న దృశ్యాలు అందరితోపాటు తననూ కలిచివేశాయని ఆ సమయంలో రోజుకు 45వేల మందికి ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి కొంతమంది కర్ణాటకవాసులను వారి స్వస్థలాలకు బస్సులో పంపానని అపుడు వారి కళ్లలో నీళ్లు ముఖంలో చిరునవ్వు ఒకేసారి చూశానని అన్నాడు. ఆ ఘటన తర్వాతే వీలైనంతమంది వలసకూలీలను వారి స్వస్థలాలకు చేర్చాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.