Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న సౌత్ ఇండస్ట్రీ…!

బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న సౌత్ ఇండస్ట్రీ…!


భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ కోలీవుడ్ లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ సౌత్ సినిమాలంటే బాలీవుడ్ కి చిన్న చూపనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ఎంత మంచి సినిమా తీసినా ప్రాంతీయ చిత్రాల్లాగే చూస్తారని.. ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వరనే కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. ఒకటి అర రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాలు తప్ప పెద్దగా బాలీవుడ్ పెద్దగా పట్టించుకుంది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దక్షిణాది సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి.

కాగా బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా స్టార్ట్ అయింది ‘బాహుబలి’ సినిమాతో అని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు సౌత్ మేకర్స్ అందరికి పాన్ ఇండియా మూవీస్ చేస్తే వర్కౌట్ అవుతాయనే ధైర్యం వచ్చింది. అందుకే ప్రతి హీరో కూడా పాన్ ఇండియా లెవల్లో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తూ తమ మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’.. ప్రభాస్ ‘సాహో’ సినిమాలు హిందీలో కూడా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి అరడజనుకు పైగా చిత్రాలు బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వసూళ్ల వేట ప్రారంభించనుంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కంప్లీట్ ఫోకస్ బాలీవుడ్ మార్కెట్ పై పెట్టాడు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్లాన్ చేసిన ప్రభాస్.. ‘మహానటి’ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని కూడా హిందీలో రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు మన డార్లింగ్. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ నటించే సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీనే అని తెలుస్తోంది.

ఇక కన్నడ బాహుబలిగా పిలవబడుతున్న ‘కేజీఎఫ్’ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ని అంతకు మించి రెడీ చేస్తున్నారు. దీంతో లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటు దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేయబోతున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. హిందీ సినిమాలని సౌత్ లో పెద్దగా పట్టించుకోని ఇలాంటి సమయంలో సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ లో మంచి ఆదరణ పొందుతున్నాయి. మొత్తం మీద బాలీవుడ్ మార్కెట్ పై సౌత్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో దండయాత్ర చేయబోతోందని చెప్పవచ్చు.