రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ఏమిటో వీడటం లేదు. సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లో ఆర్థిక లావీదేవీలకు సంబంధించిన కీలక సమాచారం బయటపడింది. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా సుశాంత్ బ్యాంక్ అకౌంట్ లలో ఒకదాన్ని పరిశీలించారు.

ఈ అకౌంట్ ద్వారా డబ్బు అత్యధిక శాతం ప్రయాణాలు.. వ్యక్తిగత విలాసాలు.. చారిటీలకు సహాయం .. దాతృత్వ ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇందులో కొంత మొత్తం రియా సోదరుడి కోసం ఖర్చు చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ సందర్భంగా కనోడియా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ని మేం పరిశీలించినప్పుడు వివిద హెడర్ ల కింద ఈ ఖర్చుల్ని వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని ఇందులో రియా ఆమె సోదరుడు కూడా వున్నారని స్పష్టం చేశారు.

గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్లు ఖర్చు చేశాడు. దానిలో ప్రయాణానికి సుమారు 4.2 కోట్లు.. పవానా ( మహారాష్ట్ర)లోని ఓ ఫామ్ హౌజ్కు 33 లక్షలు ఖర్చు చేయగా.. వ్యక్తిగత విలాసాలకు 1. 1 కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు తాము గుర్తించామని ఆయన తెలిపారు. ఇక రియా కోసం.. ఆమె సోదరుడి కోసం 9.5 లక్షలు ఖర్చు చేశారట. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1. 7లక్షల రూపాయలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్ ఖర్చు కోసం.. 3. 4 లక్షలు రియా షాపింగ్.. మేకప్ ఇతర ఖర్చుల కోసం వాడినట్లు గుర్తించినట్టు కనోడియా క్లారిటీ ఇవ్వడంతో రియా అసలు రంగు బయటపడింది. మొత్తానికి కోట్లలో ఖర్చు చేయించేసిందన్న ఆరోపణలకు బలం చేకూరకపోయినా.. లక్షల్లో మాత్రం సుశాంత్ కి ఖర్చయ్యింది.