Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘విక్రమ్’ ఫస్ట్ లుక్: ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో..!

‘విక్రమ్’ ఫస్ట్ లుక్: ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో..!


విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న 232వ సినిమా ”విక్రమ్”. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘విక్రమ్’ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

‘విక్రమ్’ సినిమా ఫస్ట్ లుక్ తోనే థియేటర్లు దద్దరిల్లిపోబోతున్నాయని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో యాక్టింగ్ పవర్ హౌసెస్ గా పిలవబడే ముగ్గురు కనిపిస్తున్నారు. విలక్షణమైన నటనతో నేషనల్ అవార్డ్స్ అందుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ – మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి – మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్నారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కంఫర్మ్ అనుకునేలా లోకేష్ కనగరాజ్.. ముగ్గురు స్టార్ హీరోల ఇంటెన్స్ లుక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించి సర్ప్రైజ్ చేసాడు.

బ్లాక్ అండ్ వైట్ బ్యాగ్రౌండ్ లో మూడు కోణాలలో కమల్ – సేతుపతి – ఫహాద్ ల ఫేస్ లు కనిపించేలా ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేయబడింది. ముగ్గురూ కూడా మధ్యవయస్కులుగా నెరిసిన గడ్డం.. గుబురు మీసాలతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. మొత్తం మీద విలక్షణ నటులను కొత్త అవతారంలో చూపించబోతున్నారని అర్థం అవుతోంది. ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ ట్వీట్ చేస్తూ.. ‘యుద్ధంతో అదిగో అదిగో వెలుగు.. శబ్ధంతో అరాచకత్వం నాశనం.. రక్తంతో అదిగో దొర్లుతున్న తల.. ఇదిగో కనిపిస్తోంది చూడు స్వర్గం.. కంపిస్తున్న భుజం.. గెలుపు నిజం’ అంటూ ఓ సందేశం రాసుకొచ్చారు.

”విక్రమ్” చిత్రంలో విజయ్ సేతుపతి – ఫహాద్ ఫాజిల్ ఇద్దరూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. వీరిద్దరూ కమల్ ని ఎలా ఢీ కొట్టబోతున్నారో చూడాలి. సేతుపతి ఇంతకముందు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘మాస్టర్’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘విక్రమ్’ చిత్రానికి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు – అరివ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చంద్రన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మొత్తం మీద ఈ చిత్రానికి ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షూటింగ్ చేస్తున్నారు.

కాగా కమల్ హాసన్ చివరగా 2018లో ‘విశ్వరూపం 2’ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై కనిపించని విశ్వనటుడు.. శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ గా ”ఇండియన్ 2” చిత్రాన్ని మొదలు పెట్టారు. అయితే కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో శంకర్ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అయితే.. కమల్ ‘విక్రమ్’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.