Templates by BIGtheme NET
Home >> Telugu News >> వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణలో నిజాలివీ

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణలో నిజాలివీ


2019 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ తేలడం లేదు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

ఒక్కరిని విచారిస్తే మరో కొత్త క్లూ అన్నట్టుగా మరొకరికి లింకు పెడుతూ సీబీఐ విచారణ విస్తృతంగా సాగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వరుసగా ఐదోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ రవాణాశాఖ సిబ్బంది హాజరయ్యారు.

హత్య జరగడానికి 15 రోజుల ముందు వివేకాను కిరణ్ కుమార్ యాదవ్ కలిసినట్టు సీబీఐ వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. హత్య జరిగిన రోజులు వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది. వాహనాల ఓనర్లను విచారించారు. వారి వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు. ఓ ఇన్నోవా వాహనం యజమాని డ్రైవర్ ను విచారించినట్టు తెలిసింది.

హత్యకు ముందు ఈ ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరాతీస్తోంది. ఈ కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తూ కేసు విచారణను వేగవంతం చేస్తోంది.

వివేకా హత్య జరిగే ముందురోజు కొన్ని అనుమానిత వాహనాలు రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాహనాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఆ వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వీరు ఇచ్చిన సమాచారమే ఈకేసులో కీలకంగా మారనుందని సమాచారం.