Templates by BIGtheme NET
Home >> Telugu News >> కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా..! శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ నిజం

కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా..! శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ నిజం


ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నాక దాదాపు 3 నెలలపాటు కరోనా మళ్లీ రాదని ఇప్పటివరకు వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ అది అబద్ధమని తేలిపోయింది. ఒక సారి కరోనా వచ్చి తగ్గాక నెలతిరగకుండానే మళ్లీ ఈ మహమ్మారి సోకే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వచ్చిన వ్యక్తిలో యాంటీ బాడీలు వేగంగా క్షీణించడమే ఇందుకు కారణం. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

కరోనా నుంచి కోలుకున్న 250 మందికిపైగా రోగుల్లో శాస్త్రవేత్తలు 5 నెలలపాటు నిర్వహించిన అధ్యయనం అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే జర్నల్లో ఇందుకు సంబంధించిన కథనాలు వెలువడ్డాయి. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 79 మందిని ఏ కరోనా లక్షణాలు లేని ఇంట్లో చికిత్స తీసుకుంటున్న 175 మంది నుంచి శాస్త్రవేత్తలు ప్లాస్మా నమూనాలు సేకరించారు. అయితే వీరిలో చాలా త్వరగా యాంటీ బాడీలు అదృశ్యమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కథరినా రోల్ట్జెన్ మాట్లాడుతూ.. ఇమ్యునోగ్లోబ్లిన్ జీ ప్రతిరోధకాలు దీర్ఘకాలం మనగలుగుతాయని అయితే తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిలో తొలుత రోగనిరోధకశక్తి ప్రతిస్పందనలు బాగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా క్షీణిస్తాయన్నారు.

కరోనా సోకిన వారిలో మొదటి నెల నుంచే యాంటీబాడీలు క్షీణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వారిలో కరోనా తిరిగి అటాక్ చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చి తగ్గిపోయినవాళ్లు తమకు మళ్లీ ఈ వ్యాధి సోకదని భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా భౌతికదూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే కరోనా సోకినవాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.