Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఇక.. మీ మొబైల్ లోనే మీ ఓటరు కార్డు

ఇక.. మీ మొబైల్ లోనే మీ ఓటరు కార్డు


దేశ ఓటర్లకు శుభవార్త చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది ఈసీ. ఇప్పుడున్న డిజిటల్ కాలానికి సరిపోయే రీతిలో.. మొబైల్ లోనే ఓటరు కార్డు ఉండేలా కొత్త ప్రయోగానికి తెర తీస్తుంది. రాబోయే కొద్ది నెలల్లో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఈ డిజిటల్ కార్డు కీలకం కానుందని చెబుతున్నారు.

మొబైల్ నెంబరుకు డిజిటల్ కార్డు అనుసంధానమై ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఓటరు కార్డు డిజిటలైజేషన్ ప్రక్రియ రెండు ప్రక్రియల్లో జరగనుందని చెబుతున్నారు. జనవరి 25 నుంచి 31 వరకు మొదటి విడత.. ఫిబ్రవరి ఒకటి నుంచి రెండో విడత డిజిటలైజేషన్ ప్రక్రియ సాగనుంది. ఓటరుకార్డు సీరియల్ నెంబరు.. ఓటరు ఫోటో.. అడ్రస్ తో పాటు ఇతర వివరాలన్ని ఒక ఫార్మాట్ లో ఉంటాయి. క్యూఆర్కోడ్ కూడా ఈ పీడీఎఫ్ విధానంలోజత చేసి ఉంటుంది.

ఈ కాపీని సేవ్ చేసుకొని మన వద్ద ఉంచుకోవటం ద్వారా.. మొబైల్ లో ఈ కాపీని చూపించినా ఒరిజినల్ కింద పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. కొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్.. తమిళనాడు.. పుదుచ్చేరి.. కేరళ.. అసోం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ డిజిటల్ ఓటరు కార్డు కీలకంగా పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసే ఈ డిజిటల్కాపీకి ఒక మొబైల్ నెంబరుతో మాత్రమే లింకు చేసే వీలుందని చెబుతున్నారు. మొబైల్ నెంబరును ఓటరు కార్డుతో లింకు చేసుకోవటం ద్వారా.. ఓటరు కార్డు పోయిందన్న సమస్య ఉండదు. ఇప్పటివరకు ఆధార్.. పాన్ కార్డులు ఫోన్ నెంబరుతో లింకు ఉండగా..ఇప్పుడు ఓటరు కార్డును కూడా మొబైల్ నెంబరుతో అనుసంధానం చేసే అవకాశం కలుగనుంది.