డ్రగ్స్ కేసు: ఒకరి తర్వాత ఒకరు.. ఇప్పుడు శ్రద్ధా వంతు…!

0

బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకావల్సిందిగా దీపికా పదుకొనే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణలో భాగంగా నిన్న (శుక్రవారం) రకుల్ ప్రీత్ సింగ్ మరియు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ హాజరవ్వగా.. నేడు (శనివారం) దీపికా పదుకొనే – శ్రద్ధాకపూర్ – సారా అలీ ఖాన్ లను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో దీపికాని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్ కూడా ముంబై కొలాబాలోని అపోలో బండర్ ఎవెలిన్ గెస్ట్ హౌస్ కు చేరుకుంది.

కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫార్మ్ హౌస్ లో నిర్వహించే పార్టీలలో శ్రద్ధా కపూర్ కూడా పాల్గొన్నారా అనే కోణంలో ఆమెను విచారించనున్నారు. టాలెంట్ మేనేజర్ జహ సాహ చాటింగ్ ద్వారా శ్రద్ధా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిందని ఆరోపణలు ఎదుర్కుంటుందని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రద్ధా ని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే విచారణ ఎదుర్కుంటున్న దీపికాపై నార్కొటిక్ అధికారుల బృందం డ్రగ్స్ కి సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపిస్తుందని సమాచారం. నిన్న విచారణకు హాజరైన దీపికా మేనేజర్ నేడు కూడా ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. ఇక హీరోయిన్ సారా అలీఖాన్ కూడా ఈ రోజే విచారణకు రానున్నారు. మొత్తం మీద డ్రగ్స్ ఇష్యూపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఒకరి తర్వాత ఒకరిని చెడుగుడు ఆడుకుంటున్నారని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.