Templates by BIGtheme NET
Home >> Cinema News >> ETV : ఓటీటీ రంగంలోకి ఈటీవీ..!

ETV : ఓటీటీ రంగంలోకి ఈటీవీ..!


డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాయి. ప్రేక్షకుడు తనకు ఇష్టమొచ్చిన మధ్యమాలలో తనకు నచ్చిన కంటెంట్ ను వీక్షించడానికి ఓటీటీలు అవకాశం కల్పిస్తున్నాయి. కరోనా పుణ్యమాని ఇవి గత రెండేళ్లలో రూరల్ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పాండమిక్ సమయంలో థియేటర్స్ మూతబడటంతో.. ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో అప్పటికే ఉన్న ఓటీటీలతో పాటుగా కొత్తగా మరిన్ని ఓటీటీలు – ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ వీక్షకులను ఆకట్టుకుంటూ సబ్ స్క్రైబర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో – నెట్ ఫ్లిక్స్ – డిస్నీ+హాట్ స్టార్ – సన్ ఎన్ఎక్స్టి – ఆహా – జీ 5 – స్పార్క్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ తెలుగు కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ‘ఈ’టీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్ రాజ్యమేలుతుందని భావించిన ప్రముఖ నిర్మాత రామోజీ రావు.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ప్రారంభించడానికి సంకల్పించారని తెలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో త్వరలోనే ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారట. ఈటీవీ వద్ద ఇప్పటికే కొన్ని వందల కొద్దీ సినిమాలున్నాయి. అలానే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన సినిమాలు వందకు పైగా ఉన్నాయి. క్లాసిక్ సినిమాతో పాటుగా కామెడీ షోలు – టాక్ షోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం ఈటీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టనున్నారు.

అంతేకాకుండా ఇండిపెండెంట్ సినిమాలు – వెబ్ సిరీస్ లు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రకటనలతో ఓటీటీ కంటెంట్ కోసం వర్ధమాన రచయితలకు ఆహ్వానం పలికింది. కొన్ని స్క్రిప్టులను పక్కకు తీసి కొత్త దర్శకులతో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే చిన్న సినిమాలను కూడా తీసుకోని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఈటీవీ ఓటీటీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తెలుగు కంటెంట్ విషయంలో ఒకటీ రెండు ఓటీటీలు మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈటీవీ ఓటీటీ ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.