Templates by BIGtheme NET
Home >> Cinema News >> సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత


టాలీవుడ్ కు ఏదో శాపం తగిలినట్టు ఉంది. దిగ్గజ సినీ ప్రముఖులంతా కాలం చెల్లిపోతున్నారు. మొన్నటికి మొన్న బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ లోకాన్ని తీరని విషాదంలో ముంచింది. ఆ బాధ నుంచి తేరకోకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. తాజాగా ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ వేషాలు.. రౌడీ గుండా వేషాలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ సుపరితమైన సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోధ ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఈరోజు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

తెలుగుతోపాటు తమిళ హిందీ భాషల్లో కలిపి సుమారు 400 చిత్రాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. ‘మాస్టర్’ ‘చంద్రలేఖ’ ‘ఇడియట్’ ‘జానీ’ ‘ఠాగూర్’ ‘వర్షం’ ‘సై’ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ‘మాస్’ ‘అడవి రాముడు’ ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు.

ఏప్రిల్ 9న సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం నర్సింగ్కు వెంటిలేర్పై చికిత్స అందిస్తున్నారని ఆయన భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. నిజానికి నర్సింగ్ యాదవ్ ఇంట్లో పడిపోయారని.. ఆయన తలకు బలమైన గాయమైందని మొదట వార్తలు వచ్చాయి. అయితే దీనిలో వాస్తవం లేదని చిత్ర చెప్పారు. తర్వాత కోలుకున్నారు. కొద్ది రోజులుగా నర్సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆయనకు డయాలసిస్ చేయిస్తున్నారని తెలిసింది.