Templates by BIGtheme NET
Home >> Cinema News >> TN ఎన్నికలకు ముందు RGV గడబిడ దేనికి?

TN ఎన్నికలకు ముందు RGV గడబిడ దేనికి?


టైమ్ చూసి టైమ్ బాంబ్ పేల్చడం ఎలానో ఆర్జీవీకి తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో. ముఖ్యంగా రాజకీయాల్ని కెలుకుతూ ఆయన ఆడే ఆట విచిత్రంగా ఉంటుంది. తనకు గిట్టని వాళ్లను టార్గెట్ చేస్తూ వారిపైనే సినిమాలు తీస్తూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ఆటాడుకుంటున్నారు. ఈ ఆటలో గెలిచామా ఓడామా? అన్నది పాయింట్ కాదు. ఆడామా లేదా? అన్నదే అసలు పాయింటు. ప్రతిసారీ ఓడినా ఆయన ఈ ఆట ఆడుతూనే ఉన్నారు.

ఇప్పుడు అనవసరంగా తమిళ రాజకీయాల్ని కెలికే పని పెట్టుకున్నారన్న చర్చా సాగుతోంది. ఇంతకుముందు ఏపీ ఎన్నికల ముందు వర్మ గడబిడ తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో లక్ష్మీ పార్వతి కోణంలో కథ రాసుకుని చంద్రబాబు-చినబాబు-బాలయ్య బాబు తదితర బృందంపై సెటైర్లు వేసారు. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ తేలిపోయినా దాని గురించి ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలో ఆసక్తికర చర్చ సాగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్ద వివాదాన్ని ప్రారంభించిన చిత్రమిది కావడంతో జాతీయ స్థాయిలో చర్చ సాగింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే సీన్ పునరావృతం చేయడానికి ప్లాన్ గీసారు ఆర్జీవీ.

మాజీ తమిళనాడు సిఎం జె.జయలలితను ఆమె ఆత్మ శశికళను ఆయన టార్గెట్ చేస్తూ `శశికళ` సినిమాని పోస్టర్ తో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చాలా మంది తమిళ ప్రముఖులపై సెటైర్లు పంచ్ లు ఉన్నాయిట. ప్రస్తుత తమిళనాడు సిఎం ఎడప్పాడి పళనిస్వామిపై ప్రత్యేక ఎపిసోడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తన చిత్రం ‘సత్యాల వెనుక ఉన్న సత్యాలను’ వెలికితీస్తుందని ఆర్జీవీ హామీ ఇచ్చారు. తమిళనాడు సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇది ఊహించని కొన్ని కొత్త వివాదాలను సృష్టించడం ఖాయమన్న చర్చా సాగుతోంది. తమిళ రాజకీయాలపై ఆర్జీవీ ప్రభావం చూపుతాడా? అభిమానుల వీరంగం చూడాల్సి ఉంటుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. లవ్ ఈజ్ డేంజరస్ లీ పొలిటికల్ అంటూ కాకలు పుట్టే క్యాప్షన్ ఇచ్చిన ఆర్జీవీ.. రాజకీయాల్లో డెప్త్ ని తెరపై ఆవిష్కరిస్తారా? అన్న చర్చా సాగుతోంది.