రామ్ గోపాల్ వర్మతో బాలయ్య!

0


Balakrishna-RGVనందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఊహించని కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. ఆయన క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. చేసేశాడు. పూరి జగన్నాథ్ కు.. బాలయ్యకు లంకె కుదురుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కుదిరింది. భవిష్యత్తులో ఇలాంటి మరో విలక్షణమైన కాంబినేషన్ ఓకే అయితే ఆశ్చర్యమేమీ లేదంటున్నాడు పూరి జగన్నాథ్.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలయ్య నటిస్తాడని ఆయన అంటున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఫేస్ బుక్ లైవ్ చాట్ సందర్భంగా పూరి ఈ వ్యాఖ్య చేశాడు. ‘మీతో పని చేస్తున్న బాలయ్య.. మీ గురువు రామ్ గోపాల్ వర్మతోనూ సినిమా చేస్తారా’ అంటూ ఓ అభిమాని పూరిని అడగ్గా.. ఎందుకు చేయరు.. కచ్చితంగా ఆర్జీవీ దర్శకత్వంలో బాలయ్య సినిమా వస్తుంది అంటూ బదులిచ్చాడు పూరి. ఏదో అభిమాని అడిగాడని పూరి మాట వరసకు ఆ మాట అన్నాడా.. లేక నిజంగా ఆర్జీవీకి బాలయ్యకు పూరి ఏమైనా లింక్ కలుపుతున్నాడా అన్నది తెలియదు.

ఐతే బాలయ్య ఈ మధ్య ఇస్తున్న షాకులు చూస్తుంటే.. ఆర్జీవీ డైరెక్షన్లోనూ ఆయన సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలయ్య ఉన్న స్పీడులో ఆయన ఎవరితోనైనా సినిమా చేసేలాగే ఉన్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న ‘రైతు’ సినిమాలో అతిథి పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలో బాలయ్య.. వర్మతో చాలా సన్నిహితంగా మెలగడం.. వాళ్లిద్దరూ చాలా సేపు ముచ్చట్లు చెప్పుకోవడం తెలిసిందే.