సినిమా సీరియస్సే.. కానీ కామెడీ అదుర్స్

0Comedy-in-Nikhil-Keshava-Movieకామెడీ సినిమాల్లో సెంటిమెంటు.. యాక్షన్ పండించడం అంత కష్టమేమీ కాదు కానీ.. సీరియస్ సినిమాల్లో కామెడీ వర్కవుట్ చేయడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే సీరియస్ సినిమాలు ఒక మూడ్ లో సాగిపోతుంటాయి. మధ్యలో కామెడీ కోసం ట్రై చేస్తే మొత్తం సినిమానే చెడిపోతుంది. అసలుకే మోసం వస్తుంది. అందుకే సీరియస్ సినిమాల్లో కామెడీ పండించడం కత్తి మీద సామే. ఐతే ‘కేశవ’ లాంటి ఇంటెన్స్ రివెండ్ డ్రామాలో దర్శకుడు సుధీర్ వర్మ కామెడీ పండించిన తీరు ప్రశంసనీయమే. ఈ సినిమాలో కామెడీ మేజర్ హైలైట్ కావడం విశేషం. వెన్నెల కిషోర్.. ప్రియదర్శి పండించిన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తోంది.

ఎక్కువ హడావుడి లేకుండా.. గోల లేకుండా సాఫ్ట్ గా కామెడీ ట్రాక్ సాగిపోవడం.. ‘కేశవ’లోని ప్రత్యేకత. వెన్నెల కిషోర్ సినిమాలో కనిపించినంతసేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా లెక్చరర్ తాను చెబుతున్న పాఠం గురించి చెప్పమంటే.. కిషోర్ అండ్ కో అతడు సీన్లోని డైలాగుల్ని వల్లె వేసే సీన్లో అయితే కామెడీ పేలిపోయింది. కిషోర్ ఏజ్ మీద వేసే పంచులు.. హెల్మెట్ జోక్.. గొడ్డలి సీన్.. ఇలా చెప్పుకోవడానికి చాలా సీన్లే ఉన్నాయి. ప్రియదర్శి కూడా సటిల్ కామెడీతో నవ్వించాడు. డైలాగులు కూడా బాగా కుదిరాయి. కామెడీ ట్రాక్ ఎక్కడా హద్దులు దాటలేదు. సినిమాకు అడ్డం పడలేదు. సినిమా సీరియస్ మోడ్ లో సాగుతుండగా.. మధ్య మధ్యలో కామెడీ ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇచ్చింది. ఆ రకంగా సినిమాకు కామెడీ పెద్ద ప్లస్ అయింది. ‘కేశవ’లో కామెడీ ట్రాక్ గురించి.. పంచ్ డైలాగుల గురించి సోషల్ మీడియాలో మంచి ఫన్ నడుస్తోంది ప్రస్తుతం.