తెలుగమ్మాయి ఇంకోటి పట్టింది

0తెలుగు హీరోయిన్లకు తెలుగు సినిమాల్లో అవకాశం దక్కడం కష్టమే అంటారు. రకరకాల కారణాలతో వాళ్లకు ఇక్కడ ఆశించిన అవకాశాలు దక్కక పొరుగు భాషల వైపు చూసే పరిస్థితి. కానీ ఈ మధ్య ట్రెండ్ మారుతోంది. లోకల్ హీరోయిన్లకు మంచి అవకాశాలే అందుతున్నాయి. ఇందుకు ఈషా రెబ్బానే సాక్ష్యం. ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన ఈషాకు కెరీర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాలేదు. కానీ ఈ మధ్య ఆమె కెరీర్ ఉన్నట్లుండి ఊపందుకుంది. ‘అమీతుమీ’ ఆమె రాతను మార్చేసింది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సరసన ‘అరవింద సమేత’లో ఆమె రెండో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇది కాక ఆమె చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి.

తాజాగా యువ కథానాయకుడు నాగశౌర్యతో ఓ సినిమాకు సంతకం చేసిందట ఈషా. వరుసగా సినిమాలు ఓకే చేస్తున్న నాగశౌర్య.. ‘భవ్య క్రియేషన్స్’లో ఒక సినిమా ఒప్పుకున్నాడు. రాజా అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే చిత్రమిది. జగపతిబాబు నటించిన క్లాసిక్ ‘ఆయనికిద్దరు’ ఆధారంగా ఈ ట్రెండుకు తగ్గ సినిమా చేయబోతున్నారట. ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఈషా రెబ్బా నటించనుంది. మరో కథానాయిక కోసం చూస్తున్నారు. నాగశౌర్యకు ఈషా మంచి జోడీ అవుతుందని భావిస్తున్నారు. ఇద్దరూ మంచి పెర్ఫామర్లు కావడంతో ఈ జోడీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ఇప్పటికే స్క్రిప్టు దాదాపుగా రెడీ అయింది. ఈ ఏడాది అక్టోబర్లు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. ప్రస్తుతం నాగశౌర్య సొంత బేనర్లో ‘నర్తనశాల’ అనే సినిమా చేస్తున్నాడు. అది కాక మరో సినిమా కూడా కమిటయ్యాడతను.