రీల్ హీరో కాస్తా రియల్ హీరో అయ్యాడు

0రీల్ హీరోగా సుప్రసిద్ధుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇమేజ్ ఒక్కసారిగా మారింది. ఆయన తాజాగా చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తాజా వీడియో క్లిప్ తో ఆయన రియల్ హీరోగా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

జాకీ ప్రధానపాత్రలో పోషిస్తున్న ప్రస్థానం మూవీ షూటింగ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సాగుతోంది. షూటింగ్ కోసం వెళుతున్న ఆయన కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది. అయితే.. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ కారులోనే ఉండకుండా ఆయన కారులో నుంచి బయటకు వచ్చారు.

ట్రాఫిక్ జాంను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు.వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన నేర్పుగా వ్యవహరించి.. జాంను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పనిని ఒకరు వీడియోగా తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.లక్నో ట్రాఫిక్ కంట్రోల్ ట్యాగ్ లైన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సాయి కుమార్.. శర్వానంద్ తెలుగులో తీసిన ప్రస్థానం సినిమాను తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో జాకీతో పాటు సంజయ్ దత్ నటిస్తున్నారు. తెలుగులో ఈ మూవీకి దర్శకత్వం వహించిన దేవ కట్ట హిందీలోనూ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.