మణికర్ణిక కొలిక్కి వచ్చేదెప్పుడిక!

0వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్ కథ ఆధారంగా రూపొందుతున్న మణికర్ణిక షూటింగ్ ఎంతకీ తెగడం లేదని బాలీవుడ్ మీడియా టాక్. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా మారడంతో కంగన మిగిలిన ప్యాచ్ వర్క్ షూటింగ్ ని తన చేతుల్లోకి తీసుకుని డైరెక్ట్ చేస్తోందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి బలం చేకూరేలా ఇప్పటికే చాలా భాగం నటించిన సోను సూద్ అందులో నుంచి తప్పుకోవడంతో అనుమానం మరింత బలపడింది. మరో ట్విస్ట్ ఏంటంటే 60 కోట్ల బడ్జెట్ తో మొదలుపెట్టిన మణికర్ణిక ఇప్పుడు 125 కోట్లను టచ్ చేసిందట. స్టార్ హీరో ఎవరూ లేకుండా కేవలం కంగనా ఇమేజ్ మీద ఆధారపడి తీసిన ఈ చారిత్రాత్మక సినిమాకు ఇది చాలా ఎక్కువ మొత్తం. భారీ బ్లాక్ బస్టర్ అయితే తప్ప పెట్టుబడి వెనక్కు రాదు. ఇదే ఇప్పుడు నిర్మాతలను టెన్షన్ లోకి నెడుతోందట. ఆఫ్ కోర్స్ కంగనా కూడా నిర్మాతల్లో ఒకరు లెండి. ఇప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ ఎడతెగకపోవడంతో చేతిలో ఉన్న ఐదు నెలల్లో అన్ని పూర్తి చేసి రెడీ చేయాల్సి ఉంటుంది.

మరో ట్విస్ట్ ఏంటంటే గత నెలన్నరకు పైగా డైరెక్టర్ కుర్చీలో కూర్చున్న కంగనా కీలకమైన భాగాలన్నీ రీ షూట్ చేస్తోందట. సోను సూద్ ఉన్న సీన్స్ తో పాటు ఝాన్సీ లక్ష్మి భాయ్ పెళ్లి చిన్ననాటి ఎపిసోడ్ ఇవన్నీ అనుకున్న రీతిలో రాకపోవడంతో మళ్ళి తీస్తోందని టాక్. ఇప్పటికే పలు వివాదాల్లో నానుతున్న మణికర్ణికకు ఇవన్నీ తలనెప్పిగా మారుతున్నాయి. మరోవైపు క్రిష్ హైదరాబాద్ లోనే ఉన్నా మణికర్ణిక గురించి మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదు. స్మార్ట్ గా తప్పుకుంటున్నాడు తప్ప అసలేం జరుగుతోందన్న క్లారిటీ ఇవ్వడం లేదు. రాజమౌళి తండ్రి బాహుబలి కథకులు విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథను విజువల్ గా చాలా గ్రాండ్ గా రూపొందించినట్టు టాక్. కానీ ఇప్పుడు ఇన్నేసి రిపేర్లు అంటే అనుమానం రావడం సహజం. మరి మణికర్ణిక ఈ అడ్డంకులు దాటుకుని ముందు చెప్పిన జనవరి 25 వస్తుందా రాదా చూడాలి. అదే రోజు కంగనా ప్రియ శత్రువు హృతిక్ రోషన్ తన సూపర్ 30 కోసం ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాడు.