మహేష్ బాబు కొత్త బిజినెస్!

0సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లోనే అత్యధికంగా సంపాదిస్తున్న హీరోగా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమాలతో పాటు లెక్కకు మించి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు గాను మహేష్ బాబు వందల కోట్ల సంపాదన దక్కించుకుంటున్నాడు. ఆమద్య ఫోర్బ్స్ జాబితాలో కూడా మహేష్ బాబు స్థానం దక్కించుకున్నాడు. మహేష్ బాబు ఆర్థిక వ్యవహారాల విషయంలో నమ్రత చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటారని ఆమె పక్కా బిజినెస్ ఉమెన్ గా వ్యవహరిస్తారు అంటూ సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఇప్పటికే అమరావతి మరియు వైజాగ్ లలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ భూములను మహేష్ బాబు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్ నుండి ఏపీలో అత్యధికంగా భూములు కొనుగోలు చేసిన స్టార్ గా మహేష్ బాబు పేరును చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన మహేష్ బాబు తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలని భావిస్తున్నాడు. గత కొంత కాలంగా మహేష్ బాబుకు ఈ ఆలోచన ఉన్నా కూడా అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతుందని సమాచారం అందుతుంది. ప్రముఖ ఏషియన్ ఫిల్మ్స్తో కలిసి మహేష్ బాబు గచ్చిబౌలీలో భారీ మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇప్పటికే గచ్చిబౌలీ ఏరియాలో మల్టీప్లెక్స్ భవన నిర్మాణం ప్రారంభం అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు – ఏషియన్ ఫిల్మ్ చేపట్టబోతున్న ఈ మల్టీప్లెక్స్ సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్లను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డబ్బు సంపాదించడంతో పాటు దాన్ని తెలివిగా వినియోగించడం – వ్యాపారంలో పెట్టడం చాలా ముఖ్యం అంటారు ఆర్థిక నిపుణులు. మహేష్ బాబు ఆ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ సినీ పరిశ్రమలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.