తాజ్‌మహల్ పర్యటకులపై భారత పురావస్తు శాఖ ఆంక్షలు

0tajmahal-restricstionsదిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌ను సందర్శించే పర్యటకులపై భారత పురావస్తు శాఖ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. పురాతన కట్టడాన్ని కాపాడేందుకు రోజువారీ పర్యటకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవింద్ర సింగ్‌ పురావస్తు శాఖ అధికారులు, ఆగ్రా జిల్లా యంత్రాంగం, సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది, తదితరులతో సమావేశం నిర్వహించి తాజ్‌మహల్‌ సందర్శకులపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలిపి 40వేల టిక్కెట్లు మాత్రమే అమ్మాలని, అలాగే ప్రతి టిక్కెటుపై తాజ్‌ సందర్శనకు మూడు గంటల కాల పరిమితి విధించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం తాజ్‌ పర్యటకులపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఏటా పర్యటకుల సంఖ్య 10 నుంచి 15శాతం పెరుగుతూనే ఉంది. పర్యటకులు ఎక్కువగా ఉండే సమయంలో రోజుకు 60వేల నుంచి 70వేల మంది కూడా తాజ్‌ వద్ద ఉంటున్నారు. తాజ్‌లో పర్యటకుల సంఖ్య పరిమితం చేసే అంశంపై నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.