న్యూఇయర్ లో టాలీవుడ్ కి గొప్ప ఆరంభం

02017-Stating-Movies2017 టాలీవుడ్ పరిశ్రమ మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ ఏడాది ఆరంభం అంత గొప్పగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 9 ఎళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడమే కాక ఆయన చేసిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి బాక్సాఫీస్ పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలాగే నందమూరి బాలకృష్ణ కుడా తన 100వ చిత్రంగా ఎప్పటికీ మర్చిపోలేని చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసి తెలుగు వారిని పులకింపజేస్తూనే కలెక్షన్ల వేటను సాగిస్తున్నాడు.

ఈ రెండు చిత్రాలు కలిసి ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో దగ్గర దగ్గర 100 కోట్ల మార్కెట్ ను జరపగా వీటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలోనే జరిగింది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత రిలీజైన ‘శతమానం భవతి’ సైతం కుటుంబ కథా చిత్రంగా మంచి ప్రజాదరణ పొందుతూ విడుదలైన అన్ని చోట్ల దాదాపు హౌజ్ ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది. ఇలా జనవరిలో రిలీజైన మూడు సినిమాలు వేటికవే భారీ విజయాల దిశగా నడుస్తూ కనక వర్షం కురిపిస్తుండటంతో పరిశ్రమకు గొప్ప ఆరంభం దొరికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. చాలా ఏళ్ళ తర్వాత ఇంత గొప్ప ఆరంభం 2017లోనే దోరికిందని చెప్పొచ్చు.