Templates by BIGtheme NET
Home >> Cinema News >> సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పై ‘బుట్టబొమ్మ’ సింగర్ ఫైర్…!

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పై ‘బుట్టబొమ్మ’ సింగర్ ఫైర్…!


బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అమాల్ మల్లిక్ తెలుగు సంగీత ప్రియులకు సుపరిచితమే. తెలుగులో ‘హలో'(హలో).. నిన్నలా(తొలిప్రేమ).. అనగనగా(అరవింద సమే).. రెండు కళ్ళూ(మహానుభావుడు).. ఏమైనదో(మిస్టర్ మజ్ను).. పడిపడి లేచే.. బుట్టబొమ్మ.. నో పెళ్లి.. వంటి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రాన్ని అందించాడు అమాల్. అయితే ఇటీవల ఓ సందర్భంలో తనకు హీరో షారుక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ప్రకటించారు ఈ యువ మ్యూజిక్ సెన్సేషన్. దీనిపై సల్మాన్ ఖాన్ అంటే నీకు ఇష్టం లేదా అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయితే దీని పై ఓపిక నశించిన అమాల్ మల్లిక్ తన ఇంస్టాగ్రామ్ లో ట్రోలింగ్ చేయడం పై ఘాటు గా స్పందించారు.

“డియర్ ఇడియట్స్.. మీరు నా ప్రొఫైల్ కు వచ్చి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే నేను సల్మాన్ ఖాన్ కు గౌరవం ఇవ్వడం లేదని మీరు అనుకుంటున్నారు. నేను ఎప్పటి నుంచో ఆయనకు రుణపడి ఉన్నాను. అతనో సూపర్ స్టార్ మాత్రమే కాకుండా బెస్ట్ ఎంటర్టైనర్ కూడా. కానీ నా చిన్నప్పటి నుంచి షారుక్ ఖాన్ ని ఇష్టపడటంలో తప్పేముందో నేను తెలుసుకోవచ్చా. దీనికి నన్ను నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారు. చంపుతాం అని బెదిరించే ఫ్యాన్స్ ఉంటే ఏ హీరో మాత్రం సంతోష పడతారు? ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం చూసి నేను నిజంగా షాక్ అవుతున్నా. చదువురాని దద్దమ్మలు నన్ను ఆత్మ హత్య చేసుకుని చనిపోవాలని చెప్తున్నారు. ఇదేనా మీ అభిమాన హీరోకు సపోర్ట్ చేసే పద్ధతి. ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఇంతగా విషం చిమ్ముతుంటే ఎవరు మాత్రం ఓపిక పట్టగలరు? నన్ను నా ఫ్యామిలీని నా ఫ్యాన్స్ ని ఏమైనా చేస్తారేమో అనే భయం తో నేను మౌనం గా ఉంటానని అనుకోవద్దు. నా వాళ్ల జోలికి ఎవరినీ రానివ్వను. నా నిర్ణయాలు కూడా తమరే డిసైడ్ చేయాలనుకున్న చదువు లేని మనుషుల్లారా.. ఇది మీ అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నా” అని పోస్ట్ చేశాడు.

అంతేకాకుండా ”నా ఆలోచనలను ఇక్కడ చెప్పాలనుకున్నాను. దీని ద్వారా మీడియా నుండి ఎవరూ కాంట్రవర్సీ టైటిల్స్ తో వాస్తవాలను వక్రీకరిస్తూ ఆర్టికల్స్ క్రియేట్ చేయలేరు. (అయినా ఇది ఇంకా జరుగుతుందని నాకు తెలుసు). మీరు బాలీవుడ్ లో మీ కెరీర్ గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తే దయ చేసి నా పోస్ట్ ను షేర్ చేయవద్దు” అని అమాల్ మల్లిక్ పేర్కొన్నాడు.