Templates by BIGtheme NET
Home >> Telugu News >> వాంగ్మూలం ఇచ్చాక ఎవరెవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పిన దస్తగిరి

వాంగ్మూలం ఇచ్చాక ఎవరెవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పిన దస్తగిరి


సీబీఐ అధికారుల విచారణకు హాజరైన వేళలోనూ నిజాలు చెప్పని అతడు.. పులివెందులలో సీబీఐ అధికారుల ఎదుట మాత్రం వాంగ్మూలాన్ని ఇచ్చి.. అసలేం జరిగిందంటూ జరిగిన విషయాల్ని పూస కుట్టినట్లుగా చెప్పేశాడు. ఇటీవల (ఫిబ్రవరి 21న) పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వాంగూల్మాన్ని ఇచ్చిన అతడికి సంబంధించి వివరాలు వెలుగు చూశాయి.

అందులో వైఎస్ వివేకాను తాము ఎలా హత్య చేసిందన్న విషయంతో పాటు.. హత్య చేసే సమయంలో వివేకాను ఎంత దారుణంగా తిట్టింది.. హింసించింది.. మొదటి వేటు వేసింది ఎవరన్న వివరాల్ని వెల్లడించారు. అంతేకాదు.. హత్య తర్వాత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత.. తానేం చెప్పానన్న విషయాల గురించి పదే పదే అడగటంతో పాటు.. వార్నింగ్ ఇచ్చిన వారి పేర్లను ఆయన వెల్లడించటం గమనార్హం. ఆ అంశాల గురించి దస్తగిరి ఏం చెప్పారన్నది అతడి మాటల్లోనే చూస్తే..

– వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక నేను.. సునీల్.. ఉమాశంకర్ రెడ్డి.. ఈశ్వరయ్య తోటలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కలిశాం.

– ‘సీబీఐకి కేసు అప్పగించారు కదా? మా సంగతేంటి?’ అని అడిగాం. దానికి వారు.. ‘మేం చూసుకుంటాం లే.. ఇబ్బంది లేదు. డబ్బులు ఏమైనా కావాలంటే అడగండి ఇస్తాం’ అని మాతో చెప్పారు.

– సీబీఐ నోటీసులు ఇచ్చి ఢిల్లీకి రమ్మన్నారు. ఆ నోటీసు పత్రాన్ని పట్టుకొని బయ్యపురెడ్డి ఇంట్లో శివశంకర్ రెడ్డిని కలిశాను. సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు చెప్పకు. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం. జీవితాన్ని సెటిల్ చేస్తామని చెప్పారు.

– ఢిల్లీకి తోడుగా ఉండేందుకు భరత్ యాదవ్ వస్తాడని చెప్పారు. సీబీఐ అధికారులు నిన్ను ఏమేం అడుగుతున్నారో.. మాకు చెబుతారని శివశంకర్ రెడ్డి.. బయ్యపు రెడ్డి.. విద్యారెడ్డిలు నాతో చెప్పారు.

– ఢిల్లీలో నాలుగైదు రోజులు ఉన్న తర్వాత.. వారికి అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నాతో ఉన్న భరత్ తిరిగి వెళ్లిపోయాడు. ఢిల్లీలో రెండున్నర నెలలు ఉన్నా. అయినా.. సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు.

– ఢిల్లీలో కలిసిన అధికారులకు ఏమేం చెప్పావంటూ పులివెందులకు వచ్చాక నన్ను అడిగారు. నిజం చెప్పలేదని చెప్పా.

– కడపలో సీబీఐ అధికారులు విచారించినప్పుడు వారితో నిజాన్ని చెప్పాను. ప్రొద్దుటూరు కోర్టులో జడ్జి ముందు అదే విషయం మీద వాంగ్మూలం ఇచ్చా. ఆ తర్వాత భరత్ యాదవ్.. శివశంకర్ రెడ్డి నన్ను కలిసి.. కోర్టు ఏం చెప్పవని అడిగారు.

– భయంతో వారికి నిజం చెప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తప్పించి ఇంకేమీ చెప్పలేదన్నాను. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తోట దగ్గరకు రమ్మంటున్నారని భరత్ యాదవ్ ఒక రోజు పిలిచాడు. అయినా నేను వెళ్లలేదు.

– ఆ తర్వాత నన్ను భరత్ న్యాయవాది ఓబుల్ రెడ్డిలను హెలిప్యాడ్ వద్దకు రమ్మని చెబితే నేను వెళ్లాను. అక్కడకు వెళ్లాక.. ఓబుల్ రెడ్డి నాతో మాట్లాడుతూ.. కోర్టులో జడ్జి ముందు ఏమేం చెప్పావో.. అన్ని అలానే చెప్పమన్నారు. అతడికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాత్రమే చెప్పినట్లుగా వెల్లడించారు.

– నువ్వు నాకు నిజం చెప్పావో.. అబద్ధం చెప్పావో నాకు తెలీదు కానీ జాగ్రత్తగా మసలుకో.. అనవసర మాటలు మాట్లాడొద్దంటూ ఓబుల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత పులివెందులలో సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి తరఫు లాయర్లు నా వాంగ్మూలాన్ని బయట పెట్టారు.

– ఆ తర్వాత భరత్ మా ఇంటికి వచ్చి.. పెద్ద తప్పు చేశావ్.. వాళ్ల పేర్లు చెబుతావా? వాళ్లు నిన్ను వదలరు. చంపేస్తారు. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు చెప్పిందంతా అబద్ధమని చెప్పమని చెప్పాడు. దీంతో నాకు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి లెటర్ రాశాను. అయినా.. వారు నా భద్రత గురించి పట్టించుకోలేదు.