Templates by BIGtheme NET
Home >> Telugu News >> వసూళ్లతో బీజేపీ ఇజ్జత్ తీస్తున్న ఏపీ బీజేపీ నేత.. కమలనాథుల అంతర్గత విచారణ

వసూళ్లతో బీజేపీ ఇజ్జత్ తీస్తున్న ఏపీ బీజేపీ నేత.. కమలనాథుల అంతర్గత విచారణ


ఏపీ నేతల కీర్తి ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయంపై తాజాగా వెలుగు చూస్తున్న అంశాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. సాదాసీదా ప్రజల సంగతి తర్వాత.. తమకు మించిన తోపులు మరెవరూ లేరని ఫీలయ్యే బీజేపీ అధినాయకత్వం సైతం తాజాగా వెలుగు చూసిన పరిణామాలతో కంగుతిన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఏ మాత్రం బలం లేని కమలనాథులు.. కేంద్రంలోని తమ పార్టీ బలాన్ని తమ బలంగా మార్చుకొని.. ఆ పనులు చేస్తాం.. ఈ పదవులు ఇప్పిస్తామంటూ భారీగా వసూలు చేసిన ఏపీ బీజేపీ నేత ఒకరి గురించిన సమాచారం బయటకు రావటం కమలనాథుల్లో కలకలాన్ని రేపింది.

పార్టీ పదవులు.. నామినేటెడ్ పోస్టులు.. ఉద్యోగాల పేరుతో వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలు రావటంతో విస్మయానికి గురైన బీజేపీ అధినాయకత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ రచ్చ ఇలా ఉండగా.. సదరు బీజేపీ నేత మాత్రమే కాదు.. అలాంటి వారు మరికొందరు ఉన్నట్లుగా తెలిసి.. షాక్ తిన్న పరిస్థితి. ఏపీలో పార్టీని బలోపేతం చేయటం మానేసి.. వసూళ్లతో తాము బలోపేతం అవుతున్నవైనానికి సంబంధించిన రిపోర్టుతో అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లినట్ులా చెబుతున్నారు.

పలువురు ఔత్సాహికుల నుంచి ఏదో ఒక పదవి పేరుతో ఒక బీజేపీ నేత భారీగా వసూళ్లు చేపట్టిన వైనం బయటకు రావటం.. ఒక ప్రముఖ మీడియా సంస్థలో ప్రముఖ వార్తగా ప్రచురితం కావటం తెలిసిందే. ఈ నేత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు ఆరా తీసి.. పార్టీలో అతగాడికున్న పలుకుబడికి.. అతడు చేసే చేష్టల గురించి నోటి వెంట మాట రాలేదంటున్నారు. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఈ అంశంపై గుట్టుగా విచారణ జరపాలని బీజేపీ అధినాయకత్వం పంపగా.. పలు విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.

విజయవాడకు చెందిన ఒక మహిళ ఏకంగా రూ.70 లక్షల మొత్తాన్ని సదరు కమలనాథుడికి ఇచ్చినట్లుగా బయటకు వచ్చింది. సమాజ చేసే తనను ఇలా మోసం చేస్తారా? అని సదరు మహిళా నేత కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇతగాడి లీలలు ఇలా ఉంటే.. కోస్తా ప్రాంతానికి చెందిన మరో రాష్ట్ర కమిటీ నేత వసూళ్లకోసం ఢిల్లీలోనే డెన్ ఏర్పాటు చేసి.. పనులు ఏవైనా ఉంటే రండి.. తాను పూర్తి చేస్తానంటూ చెబుతున్న వైనాన్ని గుర్తించారు. ఇలా ఏపీకి చెందిన బీజేపీ నేతలు కొందరు చేస్తున్న దందా ఆ పార్టీ అధినాయకత్వానికి తెలిసి.. పార్టీ బలంగా లేకున్నా.. ఈ యేషాలకు మాత్రం తక్కువగా లేదుగా? అంటూ ఆశ్చర్యపోతూ.. మహా ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు.