Templates by BIGtheme NET
Home >> Telugu News >> స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. పెట్రో ధరలు చూస్తే బాధేస్తోందిః సోమూ వీర్రాజు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. పెట్రో ధరలు చూస్తే బాధేస్తోందిః సోమూ వీర్రాజు


ఓ వైపు స్టీల్ ప్లాంట్ విక్రయానికి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. 7వ తేదీ నుంచి టెండర్లను సైతం కేంద్రం ఆహ్వానిస్తూ ఉత్తర్వులు సైతం జారీచేసింది. 28వ తేదీ వరకు బిడ్ సమర్పణకు చివరి తేదీగా కూడా నిర్ణయించింది. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. టెండర్లలో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంట్ అప్పగించేందుకు కూడా చర్యలు చేపడుతోంది.

స్టీల్ ప్లాంట్ అమ్మేసే ప్రక్రియ ఇంతవేగంగా కొనసాగుతున్నప్పటికీ.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుతామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ప్రకటిస్తుండడం గమనార్హం. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని బలంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీసుకుంటుందని చెప్పారు.

ఇదే సమయంలో పోరాటం చేస్తున్నవారిపైనా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు.. డెయిరీలు స్పిన్నింగ్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఒకేసారి రెండు విధాలుగా మాట్లాడడంపై విస్మయం వ్యక్తమైంది. సోమూ వీర్రాజు ఏం చెబుతున్నారో అర్థం కావట్లేదని అంటున్నారు.

ఇక పెట్రోల్ డీజల్ ధరలపైనా ఆయన వింత వ్యాఖ్యానం చేశారు. పెట్రో ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతోందని ఈ పరిస్థితి చూసి బీజేపీ ఎంతగానో ఆవేదన చెందుతోందని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రానికి ఆదాయ వనరులు కాదని కూడా చెప్పుకొచ్చారు. మరి బీజేపీ ఆవేదన వ్యక్తం చేస్తుందే.. ధరలు పెంచేది ఎవరో అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.