Templates by BIGtheme NET
Home >> Telugu News >> చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా జిన్పింగ్!

చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా జిన్పింగ్!


డ్రాగన్ కంట్రీ అయిన చైనాకు జీవితకాల అధ్యక్షుడి గా షీ జిన్పింగ్ కొనసాగేందుకు మార్గం సుగమం చేస్తూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వందేళ్ల చరిత్రలో ఈ తరహా తీర్మానాన్ని ఆమోదించడం ఇది మూడోసారి. రాజధాని బీజింగ్ లో మూడు రోజుల సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీ గురువారం ముగిసింది. దేశాధ్యక్ష పదవితో పాటు సీపీసీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్ పదవుల్ని కూడా 68 ఏండ్ల జిన్పింగే నిర్వహిస్తున్నారు. సీపీసీ పొలిట్బ్యూరోలో రిటైర్మెంట్ వయసు 68 ఏండ్లు. జిన్పింగ్ ఆ వయసుకు చేరుకున్నారు.

వచ్చే ఏడాదితో చైనా అధ్యక్షుడిగా పదేండ్ల పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతం ఆయన రెండోసారి చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చైనా నిబంధనల ప్రకారం ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదు. అయితే ఈ నిబంధనకు 2018లో జిన్ పింగ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నా విదేశీ విధానాల విషయంలో మాత్రం జిన్ పింగ్ విమర్శల పాలవుతూనే ఉన్నారు. షిన్ జియాంగ్ లో వీగర్ల అణచివేత హాంకాంగ్ టిబెట్ ఆక్రమణలు సహా సరిహద్దుల్లో గొడవలతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. అంతేకాదు విమర్శలను తొక్కిపెట్టేసే నాయకత్వాన్ని ఆయన సృష్టించారు. ప్రత్యర్థులను తొక్కిపెట్టేశారు.

దాంతో పాటు ఓ కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించి షి జిన్ పింగ్ ఆలోచనలు పేరిట స్కూలు విద్యార్థులకూ పాఠాల్లా బోధిస్తున్నారంటే ఆయన చైనాను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావో జెడాంగ్ తర్వాత దేశాధ్యక్షుడైన డెంగ్ జియావోపింగ్ 68 ఏళ్లు నిండినవారంతా రిటైరైపోవాల్సిందేనని రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదని అప్పట్లో ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. కానీ దానిని జస్ట్ ఒక చట్ట సవరణతో కొట్టిపారేసిన షి జిన్ పింగ్.. జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. 68 ఏళ్లు నిండినా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇటు పొలిట్ బ్యూరోలోని సభ్యుల్లో సగం మందికి వచ్చే ఏడాది 68 ఏండ్లు నిండుతాయి.

2022లో జరిగే పార్టీ మహాసభలు మూడోసారి జిన్ పింగ్ నాయకత్వానికి సాధికారంగా ఆమోద ముద్ర వేసినా ఆయన వారసుడెవరో తేల్చకుండా వదిలేస్తాయని నిపుణుల అంచనా. దీన్ని బట్టి జిన్ పింగ్ జీవితకాల అధినాయకుడిగా కొనసాగడమో లేదా 2027లో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడమో జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పట్లో ఆయనకు రాజకీయ వారసుడెవరూ ఆవిర్భవించే అవకాశాలు కనిపించడం లేదు. జిన్ పింగ్ చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా చైనా సాయుధ దళాల అధిష్టానమైన కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్ గా దేశాధ్యక్షుడిగా తనే చక్రం తిప్పుతున్నారు. గడచిన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో జిన్ పింగ్ చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడిగా ఆవిర్భవించారు.