Templates by BIGtheme NET
Home >> Telugu News >> బీఆర్ఎస్ లోకి కాసాని ?

బీఆర్ఎస్ లోకి కాసాని ?


ఈమధ్యనే తెలంగాణా టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసిన కాసాని ఒకటి రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కాసాని బాగా యాక్టివ్ గానే పనిచేశారు. రాష్ట్రమంతా పార్టీ కోసం తిరిగారు. అయితే చివరి నిముషంలో టీడీపీ పోటీలో నుండి తప్పుకోవటంతో వేరే దారిలేక కాసాని టీడీపీకి రాజీనామా చేసేశారు.

ఆర్ధికంగా చాలా పటిష్టమైన స్ధితిలో ఉన్న కాసాని చూపు బీఆర్ఎస్ మీద నిలిచినట్లు సమాచారం. పార్టీలో చేరి గోషామహల్ నియోజకవర్గంలో పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కారు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నాడు బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు కాసానితో భేటీ అయ్యారట. కేసీయార్ తరపున మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు చెప్పిందేమంటే బీఆర్ఎస్ లో చేరితే గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీకి టికెట్ ఖాయమైనట్లే అని.

అంటే గోషామహల్లో పోటీచేయాలని కాసానికి సీనియర్ నేతలు చేసిన ప్రతిపాదన కేసీయార్ తరపున జరిగినట్లుగానే పార్టీలో ప్రచారం మొదలైంది. కేసీయార్ తరపున మాట్లాడకపోతే ఒక నియోజకవర్గంలో పోటీచేసే అవకాశం దక్కుతుందని ప్రతిపాదించేంత సీన్ ఏ నేతకు లేదని అందరికీ తెలిసిందే. పైగా కాసానిని పార్టీలో చేర్చుకోవటంలో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే బీసీ నేత అవ్వటమే. బీసీల్లో కూడా ముదిరాజ్ ఉపకులానికి చెందిన కాసాని కుల సంఘాల యాక్టివిటీస్ లో కూడా తరచూ పాల్గొంటునే ఉంటారు. కాబట్టి సామాజికవర్గం పరంగా కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుందని కేసీయార్ అనుకున్నారట.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీచేసినా గెలుపు కష్టమే. ఎందుకంటే ఎంఐఎం, బీఆర్ఎస్ మిత్రపక్షాలు కాబట్టే. ఈ కారణంగానే బీఆర్ఎస్ తరపున గోషామహల్ నియోజకవర్గంలో ఎవరు పోటీచేసినా ఓడిపోతున్నది. ఈ విషయంలో కూడా కాసానికి కేసీయార్ రాజకీయంగా తగిన హామీ ఇచ్చినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఓడిపోయినా రాజకీయ భవిష్యత్తుకు తాను గ్యారెంటీగా ఉంటానని కేసీయార్ మాటగా సదరు సీనియర్లు హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.