ట్రైలర్ టాక్ : `క్లూ`

0

రెండు వంద ఏళ్ల నాటి గుప్తనిధి వెనక ఉన్న మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం `క్లూ`. ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ బ్యానర్ పై సుభానీ అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మిస్తున్న ట్రెజర్ హంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా రమేష్ రాణా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యంగ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ శేఖర్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. సబీనా జాస్మిన్.. శుభాంగి పంత్.. సంజన నాయుడు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

కాలగర్భంలో మరుగున పడిపోయిన కొన్ని వందల సంవత్సరాల నాటి గుప్త నిధి తాలూకు రహస్యాన్ని చేధించి ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నించే ఒక సిన్సియర్ ఆఫీసర్ కు అతని బృందానికి ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు.. అద్భుతాల సమాహారమే `క్లూ` ప్రధాన కథాంశం. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. `చీకట్లో కలిసిపోయిన చరిత్ర పుటల్లోని ఒక మహా సామ్రాజ్యం… అందులో అపార సంపద.. ఒకప్పుడు దానికి కాపలా దారుడు రాజ రుద్రుడు. రెండు వందల సంవత్సరాల ఆ సంపద శత్రువుల వశం అవబోతోందా? .. రాజరుద్రుడి దుష్టాత్మను ఎదిరించే శక్తి ఎవరికుంది? .. దేశం కోసం నాది అని తొలి అడుగు వేసే మగాడు ఎవరు? .. వంటి వాయిస్ ఓవర్తో సాగుతున్న ట్రైలర్.. అందులోని విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

వందల ఏళ్ల నాటి గుప్త నిధి కోసం సాగే వేట నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ వాయిస్ ఓవర్… విజువల్స్ చూస్తుంటే కథ.. కథనం చాలా ఆసక్తికరంగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. `మగధీర` ఫేమ్ దేశ్ గిల్.. షియాజీ షిండే.. జీవా.. రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.