Templates by BIGtheme NET
Home >> Cinema News >> హన్సిక క్రేజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా?

హన్సిక క్రేజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా?


హన్సిక పేరు వినగానే పాల ఒళ్లుతో .. తేనె కళ్లతో మెరిసిపోయే అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. కుంకుమపూలతో అలంకరించిన అందమైన శిల్పంలా ఆ రూపం మనసు తెరపై మెదులుతుంది. అలాంటి హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ చూసిన ప్రేక్షకులు అందం కూడా ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. ఆ సినిమా నుంచి కుర్ర్రాళ్ల చూపులను ఆమె భుజాన వేసుకుని తిరిగింది. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలు చేసినప్పటికీ ‘కందిరీగ’ సినిమాతోనే మళ్లీ మంచి హిట్ పడింది.

తెరపై ఆమె పాలకోవాలా .. పంచదార చిలకలా కనిపించడం వల్లనే కోలీవుడ్లో ఆమెకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. వరుస అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక్క తమిళంలోనే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ ఆమె స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు కాస్తా భక్తులుగా మారిపోయి ఆమెకి ఓ ‘గుడి’ కూడా కట్టేశారు. ఆ క్రేజ్ ను .. ఆ ప్లేస్ ను కాపాడుకుంటూనే వీలును బట్టి తెలుగు .. మలయాళ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.

అలాంటి హన్సిక క్రేజ్ ఇప్పుడు తగ్గిందా అంటే .. తగ్గిందనే చెప్పుకోవాలి. కోలీవుడ్లో ఏడాదికి నాలుగు సినిమాలైనా చేసే హన్సిక ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టమైపోతోంది. ‘తెనాలిరామకృష్ణ బీఏ బీఎల్’ తరువాత తెలుగులో కూడా ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. తమిళంలో కొత్త హీరోయిన్లు ఎక్కువగా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ పోటీ పెరడగడం మొదటి నుంచి కూడా గ్లామర్ పై ఆధారపడిన పాత్రలను మాత్రమే చేస్తూ రావడం ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లామరస్ హీరోయిన్స్ విషయంలో అందం తగ్గితే అవకాశాలు తగ్గడమనేది కామన్ .. అందుకు హన్సిక కూడా మినహాయింపేమి కాదు గదా!