వాకింగ్ కు వెళ్లి అంతలా మోసపోయిన సంగీత దర్శకుడు

0

కొన్ని పరిచయాలు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని మాత్రం అందుకు భిన్నంగా చేదు అనుభవాల్ని మిగులుస్తుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు ఎదురైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా.. ఆయనిప్పుడు వాపోతున్నారు. ఫిలింనగర్ లో నివసించే వందేమాతరం శ్రీనివాస్.. రోజూ వాకింగ్ కు వెళుతుంటారు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ తో పాటు ఫిలింనగర్.. శ్రీనగర్ కాలనీలకు దగ్గర్లో ఉన్న వారంతా కేబీఆర్ పార్కుకు వాకింగ్ కు రావటం మామూలే.

అలా వాకింగ్ కు వెళ్లే వందేమాతరం శ్రీనివాస్ కు ఫిలింనగర్ లో ఉండే తిరుపతయ్యతో కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. అలా పెరిగిన వారి పరిచయం.. మరింత ముందుకు వెళ్లింది. ఇదిలా ఉండగా 2018 జూన్ లో కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన తన మామను తిరుపతయ్య పరిచయం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా అప్పుగా కొంత మొత్తం కావాలంటే రూ.30 లక్షల్ని వందేమాతరం శ్రీనివాస్ సర్దారు.

మూడు.. నాలుగు నెలల్లో అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానంటూ నమ్మకంగా తీసుకున్నఅతను.. ఆ తర్వాత నుంచి ముఖం తప్పిస్తున్నాడు. దీంతో.. నెల క్రితం తన స్నేహితుడైన మధుసూదన్ రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతయ్య.. డబ్బులు గురించి ఎత్తితే చంపేస్తానని బెదిరింపులకు దిగటంతో షాక్ తిన్నారు వందేమాతరం శ్రీనివాస్. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు వాకింగ్ స్నేహం చివరకు ప్రాణాల మీదకు తెచ్చిందన్న వ్యాఖ్యలు చేయటం గమనార్హం.